Tuesday, August 6, 2013

రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 6:  రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23వ  గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్‌ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. అసాధారణమైన ప్రతిభావంతుడిగా పేరున్న రాజన్‌  ఐఏఎస్‌ కాకపోయినాఈ పదవికి ఎంపిక కాచడం విశేషం. రఘురామ్‌ రాజన్‌ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త.  అందువల్ల 7వ తరగతి వరకు  రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు.  ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్‌ మెడల్‌తో బీటెక్‌ పట్టా అందుకున్నారు.  అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్‌ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి  పీహెచ్‌డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేశారు. ఐఎంఎఫ్ లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 



  



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...