న్యూఢిల్లీలో జమా మసీదు వద్ద కాల్పులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : న్యూఢిల్లీలోని జమా మసీదు గేట్-3 సమీపంలో ఆదివారం ఉదయం 11-30 గంటలకు ఓ టూరిస్టు బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయి దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు.కామన్వెల్త్ క్రీడలు సమీపిస్తున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, కాల్పులు జరిపింది టెర్రరిస్టులు కాదని, స్థానికులు చేసిన పనేనని పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని, దీనిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలో మరింత నిఘా పెంచేందుకు, అదనంగా భద్రతా బలగాలను రంగంలోకి దింపేందుకు పోలీసు అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాగా ఢిల్లీలో కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులు హై అలర్ట్‌ను ప్రకటించి, తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే ఈనెల 22న వినాయక నిమజ్జనం, 24న అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 36వేల మంది జవాన్లను ఏర్పాటు చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు