కృష్ణాజిల్లా టీడీపీ నేత దారుణ హత్య

హైదరాబాద్, సెప్టెంబర్ 27 : కృష్ణాజిల్లాకు చెందిన తెలుగుదేశంపార్టీ నేత చలసాని వెంకటేశ్వరరావు (పండు) దారుణ హత్యకు గురయ్యారు. యూసుఫ్‌గూడ, మధురానగర్‌లో స్వప్నిక అపార్టుమెంట్‌లో ఉన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.భూ వివాదమే హత్యకు కారణమని తెలియవచ్చింది. పండు ప్రైవేటుగా ఆస్తులు సెటిల్‌మెంట్ వ్యవహారాలు చేస్తుంటారు. గతంలో కూడా విజయవాడ ఓ డాక్టర్, ఆయన కుమారుడికి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో జోక్యం చేసుకోగా పండుపై కేసు నమోదు అయింది.అప్పుడు విజయవాడ నగర కమిషనర్ సీతా రామాంజనేయులు పండును అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టిన విషయం విదితమే.ఉయ్యూరు నుంచి టీడీపీ తరఫున శాసనసభ్యునిగా రెండు సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి మంత్రి పార్ధసారధిపై పోటీచేసి ఓడిపోయారు. కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడకి చెందిన పండు రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి హత్యకు గురయ్యారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు