Wednesday, September 15, 2010

హైకోర్టులో యుద్ధకాండ:42% కోటాపై ఉధృతమైన ఉద్యమం

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రభుత్వ న్యాయవాదుల పోస్టుల్లో కోటా కోసం ఆందోళన చేస్తున్న తెలంగాణ లాయర్లు బుధవారం కూడా కోర్టుల బహిష్కారానికి పిలుపునిచ్చారు. ఉదయం కోర్టులు ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఆందోళనకారుల డిమాండ్ మేరకు అధిక శాతం న్యాయమూర్తులు బెంచ్‌లు దిగి తమ చాంబర్స్‌లోకి వెళ్లిపోయారు. బెంచ్‌లు దిగని న్యాయమూర్తులపై లాయర్లు ఆగ్రహించారు. వారి కోర్టు హాళ్లలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.అసభ్య పదజాలంతో దూషించారు. పోడియంలను తోసివేశారు. కాజ్‌లిస్టులు, న్యాయ గ్రంథాలను బెంచ్‌లపైకి విసిరి కొట్టారు. జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉన్న కోర్టు హాల్‌లో ట్యూబులైట్లు ధ్వంసం చేశారు. లాయర్లు విసిరిన పుస్తకాలు తలకు తగలడంతో ఒక మహిళా కోర్టు ఆఫీసర్ స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులు జస్టిస్ ఈశ్వరయ్య కోర్టు హాల్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పుస్తకాల అల్మరా అద్దాలు ధ్వంసం చేశారు.జస్టిస్ రఘురాం కోర్టు హాల్‌లో వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్న ఓ వృద్ధ న్యాయవాది సహా పలువురు న్యాయవాదులపై ఆందోళన చేస్తున్న లాయర్లు చేయిచేసుకున్నారు. జ్యుడీషియల్ రిజిస్ట్రార్ చాంబర్ కిటికీ అద్దాలు కూడా వారిచేతిలో పగిలిపోయాయి. 17 - 30 వరకు కోర్టు హాళ్లు, కారిడార్లలో అద్దాల పెంకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆందోళన చేస్తున్న న్యాయవాదులు తెలంగాణేతర న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు సమయం పూర్తయిన తర్వాత జడ్జిలు బయటికి వెళుతున్నప్పుడు 'జై తెలంగాణ' అంటూ పెద్దపెట్టున నినదించారు. మరికొందరు లాయర్లు హైకోర్టు గేటు ముందు రోడ్పౖ బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కోర్టుగేటుకు తాళాలువేసి, గుర్తింపుకార్డులు చూపిన తర్వాతే న్యాయవాదులను లోపలికి పంపించారు.మరికొందరు న్యాయవాదులు కోర్టు గేటు ఎక్కి లోనికి ప్రవేశించారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. హైకోర్టు ప్రాంగణంలో పోలీసులను మోహరించినా, కోర్టు హాళ్లలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను అడ్డుకోలేక పోయారు. అదేసమయంలో, ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై చేయి చేసుకోవద్దని, కోర్టు హాళ్ల నుంచి వెళ్లిపోవాలని సీనియర్ న్యాయమూర్తి పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆందోళనకు దిగిన న్యాయవాదుల ప్రతినిధులతో ప్రభుత్వచర్చలు విఫలయ్యాయి. సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ టి. మీనాకుమారి, జస్టిస్ ప్రకాశరావు, జస్టిస్ ఏ. గోపాల్ రెడ్డి, జస్టిస్ రఘురాం సమక్షంలో ఏజీ సీతారామమూర్తి, అదనపు ఏజీ సత్యప్రకాశ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, న్యాయవాది వి. రఘునాథ్ తదితరులు చర్చలు జరిపారు. మంత్రి గీతారెడ్డి ప్రభుత్వం తరఫున సందేశం పంపారు."ఆరువారాల్లోపు ప్రభుత్వ న్యాయవాదుల్లో తెలంగాణ లాయర్లకు 42% కేటాయిస్తాం. దీక్షలు విరమించండి'' అని మంత్రి కోరారు. తెలంగాణ న్యాయవాదులు ఇందుకు నిరాకరించారు. సచివాలయానికి వెళ్లిన ఏజీ, అదనపు ఏజీ దీక్ష చేస్తున్న న్యాయవాదుల ప్రతినిధులతో ఫోన్‌ద్వారా మాట్లాడారు. "మీరు కోరిన విధంగా 42% పోస్టుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధం. కావాలంటే మీతో మంత్రి గీతారెడ్డి ఫోన్‌లో మాట్లాడతారు'' అని తెలిపారు.అయితే, గీతారెడ్డి హైకోర్టుకు వచ్చి స్పష్టమైన హామీని.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏజీ రాజీనామా డిమాండ్‌ను నెరవేర్చాల్సిందేనని... అప్పటిదాకా దీక్ష కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు సచివాలయంలో మంత్రులు గీతారెడ్డి, వెంకటరమణలతో భేటీ అయ్యారు.రెండు గంటలపాటు వీరి మధ్య చర్చలు జరిగినా ఫలితం లభించలేదు. కోర్టు నియామకాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని నిబంధనలు పాటిస్తోందని, తెలంగాణ వారికి పెద్దపీట వేస్తుందని గీతారెడ్డి చెప్పారు. 42% వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇలా వుండగా మంగళవారం జస్టిస్ నాగార్జునరెడ్డి కోర్టు హాల్లో జరిగిన విధ్వంసంపై కోర్టు ఆఫీసర్ ఫిర్యాదుపై చార్మినార్ పోలీసులు కేసు నమోదుచేశారు. 'గుర్తు తెలియని న్యాయవాదుల'ను నిందితులుగా పేర్కొన్నారు. ఐపీసీలోని 147 (దాడి చేయడం), 506 (నేరపూరితమైన చర్యలు/ క్రిమినల్ ఇంటిమిడేషన్), 323 (స్వల్పంగా గాయపరచడం) 186 (విధి నిర్వహణలోని ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం), 149 (అక్రమంగా గుమిగూడటం) తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...