Friday, September 10, 2010

సురేష్ రామానాయుడుకు ఫాల్కే పురస్కారం

హైదరాబాద్,సెప్టెంబర్ 10: శతాధిక చిత్ర నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, మాజీ లోక్‌సభ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు 2009 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. భారతీయ సినిమారంగానికి అత్యుత్తమ సేవలందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు తెలుగువారికి దక్కడం ఇది ఐదోసారి.చివరి సారిగా ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు 19 ఏళ్ల క్రితం ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత దీన్ని అందుకోనున్న తెలుగు వ్యక్తి రామానాయుడు కావడం విశేషం. అక్టోబరులో గోవాలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. రామానాయుడుకి ఈ అవార్డు అందజేస్తారు. స్వర్ణకమలంతో పాటు పది లక్షల రూపాయల నగదు, శాలువాతో ఆయనను సత్కరిస్తారు.తన 47 ఏళ్ల సినీరంగ చరిత్రలో అనేక మంది తారలను వెలుగులోకి తెచ్చిన రామానాయుడు తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో చిత్రాలను నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుని తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వినువీధుల్లో ఎగురవేశారు. విఖ్యాత నట సార్వభౌమడు ఎన్టీఆర్‌తో మొదలైన ఆయన నిర్మాణ పరంపర.. ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రేమనగర్, శ్రీకృష్ణ తులాభారం, ప్రేమించు, బొబ్బిలి రాజా, అహ నా పెళ్లంట, ఆంధ్ర వైభవం, కథానాయకుడు తదితర విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ప్రేమనగర్, దిల్‌దార్, బందిష్ వంటి హిందీ చిత్రాలకు ఆయన నిర్మాత. బెంగాలీలో అసుఖ్ సినిమాతో పాటు.. సుధు ఏక్‌బార్ బోలో అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.కన్నడలో మడువే అగోనా బా, తవురమనె ఉడుగొరె, తమిళంలో వసంత మాలిగ, తిరుమంగళం, తన్నికుంట రాజ, ఒరియాలో ధర్మ దేవత, మళయాళంలో అశ్వరూఢన్, మరాఠీలో మజి ఆయి, భోజ్‌పురిలో శివ మొదలైన సినిమాలను ఆయన నిర్మించారు. రామానాయుడు.. 1963లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. భాగస్వామ్యంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పారు. ఈ పతాకంపై 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రమిదే. తెలుగులో 130 సినిమాలు నిర్మించిన ఆయన... అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, శోభన్‌బాబు, కృష్ణ, కమల్‌హాసన్, చిరంజీవి, రజనీకాంత్, రాజేష్ ఖన్నా, జితేంద్ర వంటి హీరోలతో పాటు.. జమున, పద్మిని, జయప్రద, జయసుధ, హేమా మాలిని, రేఖ, శ్రీదేవి వంటి కథానాయికలతో సినిమాలు నిర్మించారు. చలన చిత్ర రంగంలో ఆయన స్పృశించని రంగం అంటూ లేదు.జయాపజయాల ప్రయాణం నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో అద్భుత విజయాలతో పాటు అపజయాలు కూడా రామానాయుడు చవి చూశారు. రామానాయుడు 21 మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. అనేక మంది నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆయన ఇద్దరు కుమారుల్లో వెంకటేశ్ హీరోగా, సురేష్ నిర్మాతగా తమదైన స్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. మనవడు రానా కూడా హీరోగా రంగప్రవేశం చేయడంతో ఆయన వంశంలో మూడో తరం మొదలయింది. కథతో తన స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత సినిమా తొలి కాపీతో బయటకు వెళ్లాలనేది ఆయన అందుకోసం ఆయన రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్లతో పాటు ల్యాబ్ తదితర సదుపాయాలను తన స్టూడియోలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తో పాటు.. వైజాగ్‌లోనూ స్టూడియో నెలకొల్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...