Tuesday, September 14, 2010

'అండమాన్'లో టీడీపీ ప్రచారం

హైదారబాద్, సెప్టెంబర్ 24: అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 19 న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపును కోరుతూ ఉత్తరాంధ్రాకు చెందిన ఆ పార్టీ నేతల బృందం అక్కడ ప్రచారాన్ని నిర్వహించింది. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడడంతో ఈ నేతలు ప్రచారానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ బయట టీడీపీ అధికారికంగా తమ అభ్యర్ధులను నిలబెట్టడం ఇదే ప్రధమం. అండమాన్, నికోబార్ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రచారం నిమిత్తం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు కె. ఎర్రన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావులు మంగళవారం పోర్ట్‌బ్లెయిర్ చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు సహా తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా విమానాశ్రయంలో ఎర్రన్నాయుడు బృందానికి ఘనస్వాగతం పలికారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని 8, 9, 10 వార్డుల్లో పర్యటించిన అనంతరం డైరీ ఫాం సమావేశంలో పాల్గొన్న ఎర్రన్నాయుడు ప్రసంగిస్తూ... బతుకుదెరువు కోసం అండమాన్ వచ్చిన తెలుగు ప్రజలకు పాలకులు ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. డ్రైజేజీలు, రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయని దుయ్యబట్టారు. 100 గజాల నివాసస్థలాల కోసం తెలుగు ప్రజలు మొరపెట్టుకుంటున్నా కాంగ్రెస్ నాయకులు కోటి అడ్డంకులు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే తెలుగు ప్రజలు సహా అండమాన్ ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని, పరిష్కారం కోసం పోరాడతామని చెప్పారు.అండమాన్ వాసుల వెసులుబాటుకోసం విశాఖపట్నంలో ప్యాసింజర్ హాలు, అతిధి గృహాల ఏర్పాటుతోపాటు టిక్కెట్ల విక్రయం, అండమాన్ నుంచి విశాఖపట్నం మీదుగా హైదరాబాద్‌కు విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అండమాన్ శాఖ అధ్యక్షుడు ఎన్. మాణిక్యరావు, ఉపాధ్యక్షుడు ఆర్. నర్సింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ సుబ్బయ్య, జాయింట్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...