Tuesday, September 28, 2010

అమెరికా కాన్సులేట్ స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్,సెప్టెంబర్ 28 : అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీ ప్రోత్సాహక కార్యక్రమాల్లో చేరేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు అమెరికా దేశ విద్య-సాంస్కృతిక వ్యవహారాల శాఖ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సంబంధిత వివరాలను వెల్లడించింది. అమెరికాలోని ఏదైనా ఒక కమ్యూనిటీ కాలేజీలో చేరి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచే ఏడాది వ్యవధి కోర్సు పూర్తి చేసేందుకు విశ్వవిద్యాలయం నేపథ్యం లేని ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇది రెండవ సారి. ఎంపికైన అభ్యర్థులకు అమెరికా ప్రభుత్వమే రాను, పోను విమాన ఛార్జీలు, ట్యూషన్ ఫీజులు భరించి, ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. పదవ తరగతి చదవి, వారు ఎంచుకున్న రంగంలో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని, రెండు నెలల పాటు అందించే ఇంగ్లీష్ శిక్షణను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తామన్నారు. వ్యవసాయం, అప్లయిడ్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్‌తో సహా కొన్ని ఆరోగ్య రంగాలు, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగాలను ఎంచుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 22 లోగా హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ కార్యాలయం, పబ్లిక్ డిప్లొమసీ, మీడియా ఆఫీస్, పైగా ప్యాలెస్, 1-8-323, చిరాన్ ఫోర్ట్ లేన్; బేగంపేట, సికింద్రాబాద్-3 చిరునామాకు పంపాలన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...