Sunday, September 26, 2010

సూపర్ హెర్క్యులస్ వచ్చేస్తోంది...

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రవాణా విమానం సి-130జె సూపర్ హెర్క్యులస్ త్వరలోనే భారత గగనతలం నుంచి ఎగరబోతోంది. మనకు రావల్సిన ఈ తరహాలోని ఆరు విమానాల్లో మొదటిది వచ్చేనెల మొదట్లోనే వస్తోంది. జూన్‌లోనే భారత వైమానిక దళం రంగులతో సిద్ధమైన ఈ సూపర్ హెర్క్యులస్ ఇంజన్లను ఇటీవలే పరీక్షించినట్లు ఈ విమానాల ఉత్పాదక సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది. ఆరు విమానాలను కలిపి రూ. 4,600 కోట్లకు కొనే ఒప్పందం భారత్ - అమెరికాల మధ్య కుదిరింది. ఇవి వస్తే భారత సైన్యానికి, భారత వైమానిక దళానికి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే సామర్థ్యం మరింత మెరుగవుతుందని లాక్‌హీడ్ తెలిపింది. ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ సెట్ (ఐడీఎస్) సహా మనకు కావల్సిన అన్ని పరికరాలను ఇందులో అమర్చారు. తక్కువ ఎత్తులో చేసే ఆపరేషన్లు, గగనతలం నుంచి బలగాలను కిందకు వదలడం వంటివి మరింత సులభతరమవుతాయి. ఈ విమానాలు అమెరికా వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వైమానిక దళాలకు కూడా అందుబాటులోకి రాగానే తాము వీటి నిర్వహణ కాంట్రాక్టు కూడా తీసుకుంటామని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ప్రతిపాదించింది. దుమ్ముతో కూడిన, ఎత్తుపల్లాలతో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ల మీద నుంచి కూడా అత్యంత సులభంగా టేకాఫ్ తీసుకోగల సామర్థ్యం ఈ సీ-130జె విమానాలకు ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు కూడా పరికరాలు, దళాలను ఇది తరలించగలదు. పలు విమానాలు చేయగలిగే పనులను ఇదొక్కటే ఒకే సమయంలో చేయగలదు. ఇందులో నాలుగు ఇంజన్లుంటాయి. ఇందులోని కార్గో కంపార్ట్‌మెంట్ 41 అడుగుల పొడవు, 9 అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు ఉంటుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...