Monday, September 27, 2010

పదేళ్ళ తర్వాత ఖరీఫ్ లో అత్యధిక సాగు

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు, రికార్డులు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో సర్కారు అంచనాలకు మించి సాగు విస్తీర్ణం నమోదైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ సీజన్‌లో అత్యధిక స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఆహార పంటలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర వాణిజ్య పైరుల సాగు సాధారణాన్ని మించి నమోదైంది. నూనె గింజల విస్తీర్ణం మాత్రం క్షీణించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సగటు సాగు విస్తీర్ణం 78.23 లక్షల హెక్టార్లు. గత ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం మూలంగా 69.66 లక్షల హెక్టార్లలోనే రైతులు పైర్లు వేశారు. పంటల దిగుబడి, ఉత్పత్తి సైతం దారుణంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్‌లో 82.22 లక్షల హెక్టార్లలో పైర్లు సాగు చేయాలని వ్యవసాయ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి నైరుతి రుతుపవనాలు కరుణించడం, అదనులో వర్షాలు కురియడంతో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి సాగు విస్తీర్ణం నమోదైంది. ప్రస్తుతం రెండు, మూడు జిల్లాల్లో అక్కడక్కడా వరి నాట్లు మినహా.. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్లే! ఇప్పటికి 82.38 లక్షల హెక్టార్లలో వివిధ పైర్లు సాగయ్యాయి. ఖరీఫ్‌లో అత్యధికంగా సాగు విస్తీర్ణం నమోదవడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. ప్రధాన ఆహార పంట వరి సాగు విస్తీర్ణం ఖరీఫ్ సగటును మించి నమోదైంది. ఖరీఫ్‌లో వరి సగటు విస్తీర్ణం 25.22 లక్షల హెక్టార్లు. ఇప్పటికే 25.87 లక్షల హెక్టార్లలో రైతులు వరి వేశారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా డెల్టాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా నాట్లు వేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా అక్కడ కూడా సాగు పూర్తవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సారి మొక్కజొన్న, జొన్న, ఆముదాలు, పొద్దుతిరుగుడు మినహా ఇతర అన్ని ప్రధాన పంటల సాగు సగటును మించి నమోదైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...