Friday, September 10, 2010

ఒబామా వివాదాస్పద నిర్ణయం :ఔట్‌సోర్సింగ్‌కు రాయితీలు కట్

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: భారత్‌కు శరాఘాతమైన నిర్ణయమిది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'విధానపరమైన అస్త్రాన్ని' బయటకు తీశారు. ఔట్‌సోర్సింగ్ చేసే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడిన ఉద్యోగుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడనున్నాయి. విదేశీ మారక ద్రవ్యంపైనా తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి, అమెరికా సెనేట్‌లోని 100 సీట్లలో ఖాళీ అయిన 37 సీట్లకు వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఔట్‌సోర్సింగ్ ప్రధానాంశంగా మారనుంది. డెమొక్రాట్లు ఓటమి దిశగా పయనిస్తున్నారని ఇప్పటికే ఒపినియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో, ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేస్తూ ఓహియో గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఒబామా తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. అమెరికాలో తప్ప.. విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించేది లేదని చెప్పారు. అంతేగాకుండా అమెరికాలోనే మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించడంలో ఉదారంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కూడా యాదృచ్ఛికంగా ఆయన ఓహియోలో జరిపిన ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించడం విశేషం. అయితే, అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై భారత కంపెనీలు మండిపడుతున్నాయి. వచ్చే నవంబర్‌లో ఒబామా భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం మరింత వివాదాస్పదం కానుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...