Tuesday, February 9, 2010

టీమిండియాకు గట్టి దెబ్బ


నాగపూర్,ఫిభ్రవరి 9: టెస్ట్ మ్యాచ్ లలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకొనే విధంగా భారత్ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా ఫాలో ఆన్ లోనూ ఆ గండం నుంచి గట్టెక్కలేకపోయింది. కనీసం దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్ లో చేసిన పరుగులను కూడా రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి చేయలేక పోయింది. రెండో ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 6 పరుగులతో ఓటమి భారాన్ని భుజానికెత్తుకుంది. తొలి ఇన్నింగ్స్ లో వీరేంద్ర సెహ్వాగ్, రెండో ఇన్నింగ్స్ లో సచిన్ టెండుల్కర్ మినహా మరెవ్వరూ సెంచరీ దరిదాపులకు కూడా స్కోరు చేయలేకపోయారు. కాస్త గుడ్డిలో మెల్ల అన్నట్లుగా తొలి ఇన్నింగ్స్ లో ఎస్. బద్రీనాథ్ అర్ధ సెంచరి (56 పరుగులు) చేయగలిగాడు. రెండు ఇన్నింగ్స్ లో మిగిలిన ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ కూడా చేయలేక పోయారు. కాగా, భారత బౌలర్ల తీరు కూడా అలాగే వుంది. వికెట్లను తీయలేకపోయారు సరికదా దక్షిణాఫ్రికా జట్టు పరుగుల వరదనైనా భారత ఫీల్డర్లు నిలువరించలేకపోయారు. ఇలా అన్ని విభాగాల్లోనూ జావగారిపోయిన టీమిండియా ఇప్పుడు ఈ సీరీస్ లో 0 – 1 తేడాతో వెనుకబడి ఉంది. నాగ్‌పూర్ టెస్టులో ఎదురైన ఓటమి కెప్టెన్‌గా ధోనీకి మొదటిది. ఇప్పటివరకు ధోనీ సారథ్యం వహించిన 12 టెస్టుల్లో ఎనిమిది విజయాలు, ఒక్క ఓటమి (ప్రస్తుత మ్యాచ్), మూడు డ్రాలు దక్కాయి. రెండోఇన్నింగ్స్‌లో సెంచరీ ద్వారా సచిన్... టెస్టులాడే జట్లన్నింటిపైనా భారత గడ్డపై శతకాలు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్ అయ్యాడు. అయితే ఈ ఫీట్‌ను ఇదివరకే ద్రావిడ్ సాధించాడు. అంతేకాదు ఈ సెంచరీతో దక్షిణాఫ్రికాపై నాలుగు సెంచరీలు పూర్తిచేసిన రికార్డును అజరుద్దీన్, సెహ్వాగ్‌లతో పంచుకున్నాడు. ఇది మాస్టర్‌కు వరుసగా మూడో టెస్టు సెంచరీ కూడా. 2000 తర్వాత సొంతగడ్డపై భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి. ఈ మూడుసార్లూ దక్షిణాఫ్రికా చేతిలోనే పరాజయం పాలైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...