Saturday, February 13, 2010

జె.ఎ.సి. కి చెలగాటం...కాంగ్రెస్ కు సంకటం

హైదరాబాద్,ఫిభ్రవరి 14: మళ్లీ రాజీనామాల పర్వం! తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు తీవ్ర ఇరకాటం! రాజీనామాలు చేయాలని కొందరు... వాటివల్ల లాభం లేదని మరికొందరు! కాంగ్రెస్ నేతలు నిట్టనిలువునా చీలిపోయారు. శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని తెలంగాణ జేఏసీ శనివారం ఉదయం నుంచే ఒత్తిడి ప్రారంభించింది. ప్రత్యేక తెలంగాణ కోరుకునే వారంతా తమ పదవులు వదులుకోవాలని రాత్రి జరిగిన జేఏసీ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజీనామాలు చేయాలనుకునే వారు ఆదివారం ఉదయం 10 గంటలకు జేఏసీ కార్యాలయానికి రావాలని కన్వీనర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచే స్పీకర్ వద్దకు వెళ్లి రాజీనామాలు సమర్పించాలని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. 'వైదొలిగేందుకు మేం కూడా సిద్ధం' అని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే... కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురు రాజీనామా చేస్తే సరిపోదని, అందరూ తప్పుకొంటేనే కేంద్రం దిగి వస్తుందని మెలికపెట్టారు. ఇక బీజేపీ, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు రాజీనామాలకు సై అన్నారు. మిగిలింది... కాంగ్రెస్ పార్టీయే! విధి విధానాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లే... రాజీనామాలపైనా తలోమాట మాట్లాడారు. అంతకు ముందే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ఎంపీలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అంతా రాజీనామాలు చేయాల్సిందేనని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పట్టుబట్టారు. ఆ అవసరం లేదని మరో మాజీ మంత్రి జానారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజీనామాలపై దామోదర్ రెడ్డి, జానారెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కమిటీ నిర్ణయం కోసం వేచి చూడటం మంచిదని కేఆర్ ఆమోస్, జగ్గారెడ్డి తదితరులు కూడా అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పెంచేందుకు వీలుగా గవర్నర్ ప్రసంగాన్ని, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగడం వంటివి చేద్దామని కొందరు ప్రతిపాదించారు. మొత్తానికి ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. దామోదర్ రెడ్డి మాత్రం రుసరుసా బయటికి వచ్చి... తనతోపాటు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, బిక్షమయ్యగౌడ్, మోహన్‌రెడ్డి, రాజలింగం రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాజలింగం మాత్రం దీనిని అప్పటికప్పుడు ఖండించారు. రాజీనామాలు పరిష్కారం కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడమా, రాజీనామాలు చేయడమా... ఆదివారం నిర్ణయిస్తామని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...