సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్, ఫిబ్రవరి 23 : నిషేధిత డ్రగ్స్ వాడకంతో సినీ రంగానికి సంబంధం ఉందని తేలడంతో తెలుగు చలనచిత్ర రంగంలో తీవ్ర కలకలం రేగింది. నిషేధిత 'ఎఫిడ్రిన్'ను సరఫరా చేస్తూ సినీ నిర్మాత పట్టుబడటమే కాక, ఈ రాకెట్‌తో కొందరు హీరోలకూ సంబంధం ఉందని, ఓ హీరోను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ప్రచారం జరగడంతో సినీ పరిశ్రమలో ఇది చర్చకు దారితీసింది. కానీ, ఇప్పటివరకు జరిపిన విచారణలో... ఈ వ్యవహారంతో సినీ పరిశ్రమకు చెందిన వేరెవ్వరికీ సంబంధాలున్నట్లు బయటపడలేదని మాదాపూర్ పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. కమలాపురి కాలనీలోని హిమగిరి అపార్ట్‌మెంట్ జి-1లో ఉండే కామినేని వెంకటేశ్వరరావు సినీ నిర్మాత. భోజరాజు శ్యామరాజు ఆయన స్నేహితుడు. తీసిన సినిమాలు ఆడకపోవడంతో ఇద్దరూ ఆర్థికసమస్యలలో కూరుకుపోయారు.పాత అప్పులు తీర్చడంతో పాటు, కొత్త సినిమాల నిర్మాణం కోసం అడ్డదారులు తొక్కి.. ఈ క్రమంలోనే ఎఫిడ్రిన్ స్మగ్లింగ్ మొదలుపెట్టారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలకు కిలో రూ. 2,200కే దొరికే ఈ డ్రగ్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ముంబై వాసులకూ సరఫరా చేస్తున్నారు. తాము తెచ్చిన వంద కిలోల్లో ఇప్పటికే 75 కిలోలు అమ్మేశారు. మిగిలిన 25 కిలోలను జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా ఆదివారం తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వీరు ముంబై పార్టీలతో పాటు నగరంలో కూడా అమ్మేవారని చెప్పారు. గతంలోలాగే.. ఆదివారం పట్టుబడినప్పుడు కూడా తాను సినిమా పనిమీద వెళ్తున్నట్లు చెప్పి వెంకటేశ్వరరావు తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. కానీ, కారు తనిఖీ చేయగా ఎఫిడ్రిన్, రూ.5 లక్షల నగదు దొరికాయన్నారు. వెంకటేశ్వరరావు, శ్యామరాజులకు చర్లపల్లి జైల్లో స్నేహం ఏర్పడినట్టు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. అప్పట్లో శ్యామరాజు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించినట్టు సమాచారం. చెక్‌బౌన్స్ కేసులో వెంకటేశ్వరరావు చర్లపల్లి జైలుకు వెళ్లినపుడు ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారిందని తెలిసింది. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు హీరోలు, ఓ నిర్మాత హస్తం కూడా ఉన్నట్టు జరిగిన ప్రచారం చలనచిత్ర రంగంలో కలకలం రేపింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు