Tuesday, February 23, 2010

ఆంధ్ర వస్తువులపై బ్యాన్ – ప్రొఫెసర్ కోదండరామ్

న్యూఢిల్లీ, ఫిభ్రవరి 23: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆంధ్ర, రాయలసీమ నాయకుల ఆస్తుల లెక్కలు తీస్తున్నామంటూ సంచలన ప్రకటన చేసిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం మరోసారి సంచలనం సృష్టించారు. తెలంగాణను రాజకీయంగా అడ్డుకుంటున్న ఆంధ్ర, రాయలసీమ సంపన్నుల ఆధ్వర్యంలోని సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులను తెలంగాణలో బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బహిష్కరించే వస్తువులు, సంస్థల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, ఏది కొనాలి, ఏది వాడొద్దో అనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులు సోమవారం నిర్వహించిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కోదండరామ్ మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర సంపన్నులతోనే తమకు ఇబ్బంది అని, ఇంకెవరినీ వ్యతిరేకించడం లేదన్నారు. తెలంగాణను వ్యతిరేకించే శక్తుల, రాజకీయంగా అడ్డుకొని, ఆటంకాలు సృష్టిస్తున్న వారి సంస్థల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులను బహిష్కరించాలంటూ తాము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఆంధ్ర, రాయలసీమ సంపన్నుల వస్తువులను బహిష్కరిస్తామే కాని, వారి ఆస్తులు, వ్యాపారాలపై దాడులు మాత్రం చేయబోమన్నారు. తెలంగాణ సాధన ఉద్యమాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తామన్నారు. కాగా, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సింగరేణి కోల్ బెల్ట్ సమ్మెను వాయిదా వేసినట్లు కోదండరామ్ ప్రకటించారు. ఈ సమ్మెను ఎప్పుడు నిర్వహించేదీ అన్ని సంఘాలతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, మార్చి 10 వ తేదీలోగా కోల్ బెల్ట్ సమ్మె ఉంటుందన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...