Monday, February 15, 2010

రాష్ట్రపతి పాలన కోరదామా? కేబినెట్‌లో ముఖ్యమంత్రి రోశయ్య గరం

హైదరాబాద్,ఫిభ్రవరి 15: "ప్రభుత్వ నిర్వహణ అందరి బాధ్యత కాదా? సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. గొడవ చేస్తాయి. కానీ.. అధికారపక్ష సభ్యులే ముందుగా గొడవ లేవనెత్తారు. వారిని నియంత్రించాలా వద్దా? ఇలా అయితే ఎలా? దీనికంటే సులువైన మార్గం అసెంబ్లీ రద్దు చేయడమే! రాష్ట్రపతి పాలన కోరదామా? ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపడం కంటే రాష్ట్రాన్ని కేంద్రం చేతుల్లో ఉంచడమే సులువు'' అని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. సోమవారం సచివాలయంలో రోశయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షం గొడవ చేస్తే నిరోధించాల్సిన అధికారపక్ష సభ్యులే ముందుగా రభస చేశారని ముఖ్యమంత్రి ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ విషయం కేంద్రం చేతుల్లో ఉందని గ్రహించాలని అన్నారు. ఈ సమయంలో మంత్రులంతా ఏం మాట్లాడలేదు. దీంతో.. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చా? అని రోశయ్య మళ్లీ ప్రశ్నించారు. దీంతో ఉలిక్కిపడిన మంత్రులు ఒక్కసారిగా అబ్బే అదేమీ లేదంటూ సర్దుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లు మాట్లాడుతూ.. శాసనసభ్యులంతా బాగానే ఉన్నారని.. మండలి సభ్యులే గొడవ చేశారని అన్నారు. ఒకరిద్దరు శాసనసభ్యులు లేచినా.. వారిని ఒప్పించగలిగామని చెప్పారు. అయితే.. ఎమ్మెల్సీల వరుసలో ఉన్న కూర్చున ఎమ్మెల్యేలు తప్పనిసరి స్థితిలో లేచి బయటకు వెళ్లారని వివరించారు. సున్నితమైన ప్రాంతీయ అంశాన్ని లేవనెత్తుతున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తాము జోక్యం చేసుకోవడం తగదని ఊరుకున్నామని.. అప్పటికీ మంత్రి గీతారెడ్డి లేచి వెళ్లి వారిని సముదాయించే ప్రయత్నం చేశారని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలను వట్టి వసంతకుమార్ వారించారన్నారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డిలు కూడా సమష్టి బాధ్యతను తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమయంలో రఘువీరా రెడ్డి జోక్యం చేసుకుంటూ.. "ఇటీవల మీరు చేసిన సూచన మేరకు తెలంగాణ ప్రాంత మంత్రులంతా వారి బాధ్యత మేరకు పార్టీని ఐక్యంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు'' అని వివరించారు. 'లక్ష్మణరేఖను ఎవరైనా దాటితే కఠిన చర్యలు తీసుకోండి' అని రఘువీరా చెప్పారు. మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. "సీఎంగారు చెప్పినట్లు అందరమూ సమష్టిగా బాధ్యతలు తీసుకుందాం'' అన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ అంశం చర్చకు వస్తున్న నేపథ్యంలో.. హైకోర్టు జడ్జిల నియామకంపై విమర్శలు వస్తున్నాయని వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబులు తెలిపారు. నలుగురు హైకోర్టు జడ్జిల ప్యానల్‌ను పంపితే.. వారంతా తెలంగాణేతరులేనని అన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ.. జడ్జిల ప్యానల్‌ను సుప్రీంకోర్టు కమిటీ పరిశీలిస్తుందని, అయినా దీనిపై ఆలోచిద్దామని అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...