Friday, February 12, 2010

విధివిధానాలు నచ్చలేదుట...శనివారం మళ్ళీ బంద్ ట...

హైదరాబాద్,ఫిభ్రవరి 12: జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఉస్మానియా జేఏసీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. శనివారంనాడు మరో సారి తెలంగాణ బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. బంద్ కు కాకతీయ వర్శిటీ జేఏసీ మద్దతు తెలిపింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేవని ఓయు జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఉస్మానియా క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కమిటీ విధివిధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఓయు జేఏసీ అల్టిమేటమ్ ఇచ్చింది. తెలంగాణ సాధన కోసం మళ్ళీ పోరాటానికే ఓయు జేఏసీ మొగ్గుచూపుతోంది. తెలంగాణ ఏర్పాటులో కాలయాపన చేయడానికి శ్రీకృష్ణ కమిటీ అని ఓయు జేఏసీ నాయకులు తీవ్రం స్థాయిలో విమర్శించారు. ఓయు జేఏసీ ర్యాలీ నిర్ణయం సమాచారం తెలిసిన వెంటనే క్యాంపస్ లో పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి అలాంఛనీయ సంఘటనలూ ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు ఉన్నతాధికారులు కూడా క్యాంపస్ కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తెలంగాణ శ్రేణులు శుక్రవారం ఉదయం నుంచీ రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...