Tuesday, February 23, 2010

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం: 9 మంది ఆహుతి

బెంగళూరు, ఫిబ్రవరి 23 : ఐటీ హబ్ బెంగళూరులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత విమానాశ్రయానికి వెళ్ళే ప్రధాన రహదారిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తొమ్మిది మంది సజీవ దహనం అయినట్లు అనధికారిక వర్గాలు వెల్లడించిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో మరో 80 మంది వరకూ గాయపడ్డారు.వీరిలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇంకా పదుల సంఖ్యలో ప్రజలు మంటల లోపల చిక్కుకుని సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించి ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీనితో లోపల ఉన్నవారు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు పదిహేను అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రక్షక బృందాలు రంగంలోకి దిగి కిటీకి అద్దాల గుండా ఒక్కొక్కరినే వెలికి తీస్తున్నాయి. అయినప్పటికీ ఓ తొమ్మిది మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంకా లోపల పదుల సంఖ్యలో ప్రజలు లోపల ఉన్నట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన వారు చెబుతున్నారు. అయితే మృతులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రమాదం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. చుట్టుపక్కల భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...