Tuesday, February 9, 2010

బీ.టీ. వంకాయకు బ్రేక్


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశవ్యాప్తంగా ఎదురైన వ్యతిరేకతతో ప్రభుత్వం ఎట్టకేలకు బీటీ వంగపై వెనక్కి తగ్గింది. వ్యాపారాత్మకంగా బీటీ వంగ సాగును ప్రస్తుతానికి అంగీకరించకూడదని నిర్ణయించింది. శాస్త్రవేత్తలు, రైతులలో దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరాం రమేశ్ మంగళవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటికిప్పుడు బీటీ వంగ సాగును ప్రవేశపెట్టాల్సిన అవసరమేమీ లేదని, దీర్ఘకాలంలో మానవుల ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావం గురించి స్వతంత్ర శాస్త్రీయ పరిశధనలు జరిగి, వాటి ఫలితాలు తేలేవరకు వీటిని ఆమోదించబోమని తెలిపారు. ప్రస్తుత నిర్ణయం వంకాయకే పరిమితమని.. భవిష్యత్తులో బెండకాయ, క్యాబేజి, బియ్యం వంటి ఉత్పత్తులలో జన్యుపరివర్తిత పంటలపై ఈ నిషేధం ఉండబోదని జైరాం స్పష్టీకరించారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేయగా, ప్రతిచోటా ఆయనకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు బీటీ వంగ సాగును వ్యతిరేకించగా, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్‌లు మాత్రం 60 శాతం బీటీ వంగ సాగుచేసేందుకు ముందుకొచ్చాయన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలంతా బీటీ వంగను తీవ్ర గా వ్యతిరేకించారు. తాజాగా గుజరాత్ ప్రభుత్వం కూడా దేశంలో బీటీ వంగను అనుమతించొద్దని కేంద్రాన్ని కోరింది. ఈ రకం వంకాయలో పురుగులను అరికట్టేందుకు కొన్ని విష పదార్థాలుంటాయని, అవి మానవ ఆరోగ్యానికి హానికరమని కొందరు శాస్త్రవేత్తు కూడా చెబుతున్నారు. రాష్ట్రం లో గ్రీన్‌పీస్ సహా దేశవ్యాప్తంగా పలు సంస్థలు బీటీ వంగ ను వ్యతిరేకిస్తున్నాయి. బీటీ వంగను రాజకీయం చేయొద్దని, శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని జాతీయ విత్తన ఉత్పత్తిదారుల సంఘం (ఎన్ఎస్ఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. బీటీ వంగ సాగును ఎలాగైనా ప్రవేశపెట్టే ఉద్దేశంతోనే తమ శాస్త్రసాంకేతిక సలహాదారు నీనాపెడారాఫ్ భారత్ వచ్చారన్న ఆరోపణలను అమెరికా కొట్టి పారేసింది. బీటీ వంగసాగుతో ఆమె పర్యటనకు ఏ సంబంధం లేదని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఢిల్లీలో చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...