Tuesday, February 23, 2010

నవ్వుల డింగరీ ఇకలేరు..


చెన్నై,ఫిభ్రవరి23: పద్మనాభంకొన్ని తరాలను ఊపిరాడకుండా నవ్వించారు. కంట తడి పెట్టించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి అజరామరమైన గాయకున్ని తెలుగువారికి అందించారు. కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రి పురానికి చెందిన బసవరాజు వెంకట పద్మనాభరావు కేవలం 12 సంవత్సరాల వయస్సులో సినిమాలపై అమితమైన వ్యామోహంతో, గాయకుడుగా ఓ వెలుగు వెలగాలని, అప్పటి చెన్నపురి మహానగరం చేరుకున్నారు. తొలిసారిగా మహానటి కన్నాంబను తన పాటలతో మెప్పించిన ఈ కుర్రాడు రాజరాజేశ్వరీ కంపెనీలో కళాకారుడుగా అడుగు పెట్టాడు. అలా చెన్నయ్ నగరంలో ఎదుగుతూ, గూడవల్లి రామబ్రహ్మం పరిచయంతో ఆయన రూపొందించిన మాయాలోకం అనే సినిమాలో తెరంగేట్రం చేశారు. ఇలా సినిమాలు, సీఎస్ఆర్ వంటి సీనియర్ నటులతో కలిసి ాటకాలు ఆడుతూ, నాగయ్య గారి త్యాగయ్య సినిమాలో కనిపించి, 1947లో వచ్చిన 'రాధిక' సినిమాలో కృష్ణుడుగా మెరిసి ఎల్ వీప్రసాద్ వంటి మహామహుల అభిమానం సంపాదించుకున్నారు. చివరకు నాగిరెడ్డి చక్రపాణి పరిచయంతో వాహిని సంస్థలో ఉద్యోగిగా నటజీవితాన్ని రూపొందించుకున్నారు. 1949లో వచ్చిన షావుకారు చిత్రం పద్మనాభాన్ని నటుడుగా నిలిపింది. రూ.150 ల జీతంతో ప్రారంభమైన కుర్రాడి జీవితం నెమ్మదిగా జీవితంలో వెలుగు నీడలను, మంచి చెడులను రుచి చూస్తూ, నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా పద్మనాభాన్ని తెలుగు సినీ ప్రేమికుల హృదయంలో నవ్వుల రేడుగా నిలిపింది. నటుడుగా పద్మనాభం జీవితానికి గూడవల్లి రామబ్రహ్మం ఊపిరి పోస్తే, దిగ్ధర్శకుడు కేవీ రెడ్డి మెరుగులు దిద్దారు. షావుకారు తరువాత 'పాతాళభైరవి' సినిమాలోని డింగరీ పాత్ర పద్మనాభానికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. పొట్ట చేత పట్టుకుని సినిమాలో చేరాలనే కోరికతో మద్రాసు చేరుకున్న ఆయన తరువాత కాలంలో 80 మందికి పైగా దర్శకులతో 400 సినిమాలలో పనిచేశారు. నటుడుగా విజయవంతంగా ఎదిగిన ఆయన నిర్మాతగా కూడా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తొలి ప్రయత్నంగా ఎన్.టి.ఆర్. సావిత్రి జంటగా 'దేవత' చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై నాటకాలను ప్రదర్శించిన పద్మనాభం చిత్ర నిర్మాణ సంస్థకు కూడా అదే పేరు పెట్టుకున్నారు. 'దేవత' చిత్రంలో సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో భమిడిపాటి రాధాకృష్ణ రాసిన 'ఇదేమిటి' నాటకం ఆధారంగా 'పొట్టి ప్లీడరు' చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం.ఈ సినిమాలో ఆయన టైటిల్ పాత్రను పోషించగా, శోభన్‌బాబు, గీతాంజలి జంటగా నటించారు. 1967లో పద్మనాభం నిర్మాతగా రూపొందిన 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా పద్మనాభం గాయకుడుగా తెలుగువారికి గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈ మూడు చిత్రాలకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, 'శ్రీరామకథ' సినిమాతో ఆయనే దర్శకుడిగా మారారు. 1969లో పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన 'కథానాయిక మొల్ల' చిత్రం రసజ్ఞులను మెప్పించడమే కాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే తుఫాను బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ సారధ్యంలో 40 మంది నటీనటులు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది. ఆ కార్యక్రమాలను విక్రం స్టూడియోలో 'సినిమా వైభవం'గా చిత్రీకరించారు. కృష్ణ, విజయనిర్మల, ప్రభాకరరెడ్డి, జమున, చలం, శారద, రాజబాబు తదితరలు ఇందులో పాల్గొన్నారు. దీనిని ఆ తర్వాత థియేటర్లలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన లభించింది. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'పెళ్లికాని తండ్రి' (1976). హిన్దీలో హాస్యనటుడు మహమ్మద్ నటించిన 'కువారా బాప్' చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పద్మనాభం తనయుడు మురళి కూడా నటించారు. దేవత (1964), పొట్టి ప్లీడర్ (1966), శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967), శ్రీరామకథ (1969), కథానాయిక మొల్ల (1970) చిత్రాలతో పాటు 'జాతకరత్న మిడతంభొట్లు' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎస్.వి. రంగారావు, కన్నడంలో నాగయ్య కోయదొరలుగా నటించారు. గుహనాథన్ రాసిన తమిళ నాటకం 'కాశీ యాత్ర' ఆధారంగా ఆయన నిర్మించిన 'ఆజన్మ బ్రహ్మచారి' చిత్రంలో నాగభూషణం టైటిల్ పాత్ర పోషించారు. రామకృష్ణ, గీతాంజలి ఇందులో జంటగా నటించారు. ఆ తర్వాత భానుమతి ప్రధాన పాత్రగా 'మాంగల్య భాగ్యం' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం, రమాప్రభ జంటగా నటించారు. అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన పద్మనాభం మిమిక్రీ చేయడంలో సిద్ధహస్తులు. సీనియర్ నటులను సెట్‌లో అనుకరిస్తూ ఇతరులకు వినోదం పంచేవారు. అలాగే ఆయన మంచి గాయకుడు కూడా. 'దేవత' సినిమాలో 'మా ఊరు మదరాసు.. నా పేరు రాందాసు' పాట పాడటమే కాకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనె మనసులు'లో ఆయనకి ప్లేబ్యాక్ పాడారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...