జాడ లేని అరుణాచల్ సి.ఎం.
ఇటానగర్,మే 1 : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో తప్పిపోయిన దీని ఆచూకీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెలియరాలేదు. దీంతో అటు రాష్ట్రంలో, ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హెలికాప్టర్ కోసం భద్రతాబలగాలు సాయంత్రం వరకు ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. పవన్ హన్స్ సంస్థకు చెందిన ‘ఏస్ 350 యూరోకాప్టర్ బీ-3’ అనే ఈ హెలికాప్టర్ శనివారం ఉదయం 9.56 గంటలకు తవాంగ్ నుంచి టేకాఫ్ తీసుకుంది. ఉదయం 11.30 గంటలకు ఇది తవాంగ్‌కు 200 కి.మీ దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో గల్లంతైంది. నాలుగు నెలల క్రితమే తయారైన ఈ హెలికాప్టర్‌లో ఖాండుతోపాటు ఆయన భద్రతాధికారి యేషి చోద్దాక్, తవాంగ్ ఎమ్మెల్యే సేవాంగ్ ధోండప్ సోదరి యేషి లామూ, హెలికాప్టర్ సిబ్బంది కెప్టెన్ జేఎస్ బబ్బర్, కెప్టెన్ కేఎస్ మాలిక్‌లు ఉన్నారు. బీ-3 టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత చైనా సరిహద్దులోని సెలా పాస్ వద్ద ప్రయాణిస్తుండగా దానితో కంట్రోల్ రూమ్‌కు సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ మధ్యాహ్నం భూటాన్ సరిహద్దులోని ఎగువ సబాన్...