Monday, September 1, 2014

చేతివ్రాతనే లిపిగా గుర్తింపు తెచుకున్న బాపు..

చేతివ్రాతనే ఒక లిపిగా గుర్తింపు తెచుకున్న బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన సత్తిరాజుని మహాత్ముడి స్ఫూర్తితోను, తన తండ్రి పేరు కలిసొచ్చేలా ‘బాపు’ అని ఆయన తల్లి ముద్దుగా పిలుచుకునేవారు. తరువాతి కాలంలో ఆ పేరే ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏ పుస్తకంలో చూసిన బాపు చేతవ్రాత ఫాంట్‌లో అక్షరాలు తప్పక కనిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి  బాపు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని నిడమోలులోని అమ్మమ్మ ఇంట్లో   1933, డిసెంబర్‌ 15న జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా మద్రాసుకి వచ్చిన బాపూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 1955లో బీఎల్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చిత్రకారుడిగా ప్రావీణ్యం సాధించిన బాపు 1945లో ‘ఆంధ్రపత్రిక’లో కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. హిందూ దేవతారూపాలను ఎక్కువగా చిత్రీకరించేవారు. బాపూ సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రామాయణంను తన సినిమాల ద్వారా సామాన్య ప్రజలకి చేరువ చేసిన ఘనుల్లో బాపూ కూడా ఒకరు.  1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిపి మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బాంగారుపిచ్చిక’ (1978), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), సంపూర్ణ రామాయణం (1971), అందాల రాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘సీతాకల్యాణం’ (1976), భక్తకన్నప్ప (1976) ‘సీతాస్వయవరం’ (1976), ‘మనవూరి పాండవులు’ (1978), ‘తూర్పు వెళ్లే రైలు’ (1979), రాధాకల్యాణం (1981), ‘సీతమ్మ పెళ్లి’ (1984), ‘రామబంటు’ (1996), ‘రాధా గోపాలం’ (2005), ‘సుందరాకాండ’ (2008), ‘శ్రీరామరాజ్యం’ (2011)... బాపూ తెరకెక్కించిన దృశ్యకావ్యాల్లో కొన్ని. హిందీలో ‘హమ్‌ పాంచ్‌’ (1980), వో సాత్‌ దిన్‌ (1983), ‘మొహబ్బత్‌’ (1984), ‘ప్యారీ బెహ్న’ (1985) చిత్రాలు తీశారు. 
పురస్కారాలు...
1986లో రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును, బాపు రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపూని వరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీలతోపాటు పలు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా ఆయన పొందారు.  


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...