Saturday, September 27, 2014

జయ గణ మన......నాలుగేళ్ళ జైలు... 100 కోట్ల జరిమానా ...


బెంగళూరు, సెప్టెంబర్‌ 27 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. జయలలిత 100 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది. జయలలితతో పాటు శశికళకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. 

అలాగే జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌, ఇలవరసిలకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. జయలలితతో పాటు శిక్షలు పడ్డ మిగిలిన ముగ్గురికీ తలా పది కోట్ల జరిమానాను కోర్టు విధించింది. అంటే ఈ కేసులో మొత్తం 130 కోట్ల రూపాయలను జరిమానాగా కట్టాలని కోర్టు ఆదేశించింది. భారత దేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిమానా విధించిన కేసు మరొకటి లేదు. 
ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ డికున్హా ఈ శిక్షలను ప్రకటించారు. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు ప్రత్యేక న్యాయ స్థానం సంచలనాత్మక తీర్పు ఇవ్వడంతో కోర్టు దరిదాపులలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శిక్ష విధించిన వెంటనే జయలలితను బెంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 



ఈ తీర్పును న్యాయస్థానం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే వెల్లడిస్తుందని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. అయితే అప్పటికే కోర్టు చుట్టుపక్కల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో తీర్పు ప్రకటన ఆలస్యమైంది. జయలలిత అనుయాయులు పెద్ద ఎత్తున కోర్టు సమీపానికి చేరుకోవడంతో పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్ల వల్ల ఆ ప్రాంతం మొత్తం కర్ఫ్యూ విధించినట్టుగా మారిపోయింది. 


నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో ఈ ప్రత్యేక న్యాయస్థానంలో జయలలిత బెయిలు పొందే అవకాశం లేదు. మూడేళ్ల లోపు జైలు శిక్ష గనక పడితే ఏ కోర్టు అయితే శిక్ష విధించిందో అదే కోర్టు బెయిలు కూడా మంజూరు చేయవచ్చు. అయితే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పడిందే ప్రత్యేక పరిస్థితులలో కాబట్టి జయ బెయిలుకు బెంగుళూరు హై కోర్టులో ప్రయత్నించవచ్చా, లేక సుప్రీం కోర్టుకు వెళ్లాలా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  

ఇపడు జయలలితకు బెయిలు రావాలన్నా కనీసం వారం పది రోజులు పట్టవచ్చునని న్యాయకోవిదులు అంచనా .దసరా కావడంతో ప్రస్తుతం కోర్టులకు సెలవులు. ఆ తర్వాత కూడా జయలలిత ఎలా బెయిలు కోసం యత్నించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

అలాగే జయ సంపాదించిన ఆస్తులు 66 కోట్ల రూపాయలుగా అంచనా. అయితే ఇంతకుముందే అధికారులు బంగారు ఆభరణాలను, వెండి ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఇపడు కోర్టు విధించిన 100 కోట్ల రూపాయలను జయ ఏ ఖాతానుంచి తీసుకువచ్చి చెల్లిస్తారన్నది అస్పష్టంగా ఉన్నది. అలాగే జయతో పాటు మిగిలిన ముగ్గురు కూడా తలా పది కోట్లు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. వారు కూడా ఈ సొమ్మును ఎలా తీసుకువ స్తారన్నది సందేహమే. అంటే ఈ అక్రమాస్తుల కేసులో జరిమానాగా కట్టవలసిన మొత్తం రూ.130 కోట్లకు వీరంతా లెక్కలు చూపవలసి ఉంటుంది. అంటే బ్లాక్‌ మనీగా గాక వైట్‌ మనీగానే చూపాలి. ముఖ్యమంత్రిగా కేవలం ఒక్క రూపాయినే జీతంగా తీసుకుంటానని జయ ప్రకటించిన నేపథ్యంలో ఇంత మొత్తానికి లెక్కలు చూపడం సాధ్యమా అన్నది ఇపడు మరొక కీలకమైన ప్రశ్న.
 
1991 నుంచి 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో భారీ అక్రమాస్తులు సంపాదించినట్ల్లు 1997లో డీఎంకే పార్టీ జయలలితపై కోర్టులో ఫిర్యాదు చేసింది. జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్మామి సైతం కోర్టులో, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జయలలిత నివాసంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించగా భారీగా బంగారం, వెండి, ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 66.65 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ఈ కేసుపై గత 17 సంవత్సరాలు విచారణ కొనసాగింది. ఈ కేసు అనేక మలపులు తిరిగిన అనంతరం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను బెంగుళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాలు బలమైన వాదనలు వినిపించారు. జయలలిత దోషి అని చెప్పడానికి పూర్తి ఆధారాలు లభించినమేరకు న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
జయలిలత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈరోజు వెలువడిన తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడింది. భారీ ఎత్తున చెన్నై నుంచి కార్యకర్తలు, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఓ వ్యక్తికి జైలు శిక్ష పడటం, పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావడం చాలా అరుదుగా జరుగనున్న తరుణంలో ఈ తీర్పుపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను  మొహరించారు. జయలలితకు ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించడంతో ఆమె తమ పదవికి ఏ క్షణాన్నయినా పదవికి రాజీనామా చేయవచ్చునని తెలుస్తున్నది. ఈ జైలుశిక్షతో ప్రజా ప్రతినిధిగా ఆమె అర్హత కోల్పోయినట్టయ్యింది. 

కోర్టు తీర్పు చెప్పడంతో జయ అభిమానులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. ముగ్గురు అభిమానులు జయ ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే వారి యత్నాలను సకాలంలో విరమింపజేశారు. 

చెన్నై వీధులలో తిరుగుతున్న బస్సులపై అన్నా డిఎంకె అభిమానులు రాళ్లు విసరడంతో కొన్ని బస్సులు దెబ్బతిన్నాయి. బస్సులపై అభిమానులు ప్రతాపం చూపడంతో కర్నాటకనుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలనుంచి కూడా తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...