Monday, September 29, 2014

జాతీయ ఉద్యమం తరహాలో భారత్ అభివృద్ధి...నరేంద్ర మోడీ


న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 28: దేశ ప్రజల ఆకాంక్షలు 100 శాతం నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతుందని.. అప్పటికల్లా ప్రతి భారతీయుడికీ ఇల్లు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం న్యూయార్క్ లోని ప్రఖ్యాత మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను, భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యూఎస్‌లోని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రవాస భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయుల ఐటీ ప్రతిభ నుంచి ఇస్రో మామ్‌ ప్రయోగం దాకా పలు అంశాలను స్పృశిస్తూ దేశ గొప్పదనాన్ని పదేపదే గుర్తుచేశారు. ‘‘మన పూర్వీకులు పాముల్ని ఆడించేవాళ్లు, కానీ మనం (కంప్యూటర్‌)మౌస్‌తో ఆడుకుంటున్నాం. మన కుర్రాళ్లు మౌస్‌ను కదిలించి ప్రపంచాన్నే కలిపేస్తున్నారు’’ అని యువతను కొనియాడారు. 
‘‘ఎన్నికల్లో గెలవడం పదవి కోసమో కుర్చీ కోసమో కాదన్న ఆయన.. ప్రధాని పదవి చేపట్టాక తాను 15 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోలేదన్నారు. స్వాతంత్య్ర పోరాటం జాతీయ ఉద్యమంలా సాగినట్టే అభివృద్ధి సాధన కూడా జాతీయ ఉద్యమం కావాలన్నారు. దేశాభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మలుస్తామని స్పష్టం చేశారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో.. అక్కడ కలిగిన మార్పును చూసేందుకు విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించానని, ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పారు. ప్రవాస భారతీయులకు వరాలు ప్రకటించారు. ‘‘ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని నాకు బాగా తెలుసు. భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అన్నప్పుడు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ వారిని మరింత ఉత్సాహపరిచేలా ప్రసంగించిన మోదీ.. ‘భారత్‌ మాతా కీ జై’ నినాదంతోనే ప్రసంగాన్ని ముగించారు! కొసమెరుపుగా.. కార్యక్రమం చివర్లో భారత జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగుల బెలూన్లను ఆడిటోరియం పై భాగం నుంచి కిందికి జారవిడువడంతో కేరింతలు మిన్ను ముట్టాయి. 
 స్వచ్ఛ భారతే మహాత్మునికి కానుక
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం మహాత్ముడికి ఇష్టమైన మొదటి పని అయితే రెండో పని సఫాయి.. ఆయన ఎప్పుడు పరిశుభ్రత విషయంలో రాజీ పడలేదు. ఆయన 150వ జయంతి 2019లో వస్తోంది. ఆయన కోసం మనం ఏం చేశాం? ఆయనొచ్చి మీకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టాను. మీరు నాకేమిస్తారు? అని అడిగితే ఏం చెబుతాం? ఆయన జయంతి నాటికి స్వచ్ఛ భారత్‌ను చేయలేమా? ఆయన పాదాలకు దానిని కానుకగా ఇవ్వలేమా? అది మన బాధ్యత కాదా? అందుకే 2019 నాటికి భారత్‌ను ‘స్వచ్ఛ భారత్‌’ను చేసేద్దాం. వినమ్రంగా ఆయన పాదాలకు ‘స్వచ్ఛ భారత్‌’ను కానుకగా ఇద్దాం. ఏం దానిని మనం చేయలేమా? చేసి చూపిద్దాం. పరిశుద్ధ భారత్‌గా దేశాన్ని తీర్చి దిద్దుదాం. దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం నా పనో కాదో నాకు తెలీదు. కానీ, ప్రతి ఇంటికీ టాయిలెట్‌ను నిర్మించాలి. నేనో చిన్న కుటుంబం నుంచి వచ్చాను. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలను చేయడం నా బాధ్యత. 
 గంగ శుద్ధితో ఆర్థిక ప్రయోజనాలు
 గంగా నదిని శుద్ధి చేయడం ఎంత ము ఖ్యమో చెప్పారు. ఆ పని తమ ప్రభుత్వం చేపట్టాలని తాను నిర్ణయించినప్పుడు అది చాలా కష్టమని చాలా మంది నిరుత్సాహపరిచారని తెలిపారు. అయితే.. అలాంటి మాటలను తాను పట్టించుకోలేదన్నారు. కష్టమైన పనులను చేయడానికే తాను ఉన్నానని మోదీ చెప్పారు. భారత్‌లోని 40 శాతం జనాభా గంగపై ఆధారపడి ఉందని చెప్పిన ఆయన, ఆ నదిని శుద్ధి చేయడం ఆర్థికంగానూ ప్రయోజనకరమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐల సహకారాన్ని ఆయన అర్థించారు. అంతే కాక భారతీయులకు సంబంధించి తన కలను ఆయన వెల్లడించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి భారత్‌లో ఎవరూ ఉండడానికి ఇల్లు లేకుండా ఉండరాదన్నది తన కోరిక అని తెలిపారు. అప్పటికి భారతీయులందరికీ సొంతఇళ్లు సమకూరేలా తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు.
చట్టాలను చేయడమే కాదు..
తీయడమూ ముఖ్యమే

‘‘చట్టాలు చేయడమేనా.. తీయడం కూడా ముఖ్యమే’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏవేవో కొత్త చట్టాలు చేస్తామని చెప్పాయని గుర్తు చేశారు. తాను మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత, పనికిమాలిన చట్టాలను తీసేస్తున్నానని చెప్పారు. కాలదోషం పట్టిన చట్టాలను రోజుకొకటి తీసేస్తే, తనకు చాలా సంతోషమని స్పష్టం చేశారు. మోదీ ఈ మాట అన్నప్పుడు జనం నుంచి భారీగా స్పందన వచ్చింది. పనికిరాని చట్టాలను తీసేయడం తనకున్న ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు.

‘జన్‌ధన్‌’కు రూపాయి వద్దన్నా 
ఒక్కరోజే 1500 కోట్లు వచ్చాయి
 భారతదేశానిది అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో పేదలకు భాగస్వామ్యం ఉండాలా? వద్దా? అందుకే ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాను. పథకానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జీరో ఖాతా తెరవమన్నా. కానీ, భారతీయులు ఎంత నిజాయితీ పరులంటే.. ఉచితంగా తీసుకోలేదు. అందుకు నిదర్శనం ఒక్కరోజే ఈ పథకం కింద 1500 కోట్లు ఖాతాలో జమ అయ్యాయని, ఇప్పటిదాకా నాలుగు కోట్ల మంది భాగస్వాములయ్యారని తెలిపారు. గ్రామీణ ప్రాం తాల్లోని పేదలకు పథకం ఫలాలు అందేలా చే యాలనుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని అమలు చేశాను.
 ఆటో ఖర్చు కన్నా తక్కువకే..
అంతరిక్షంలోకి..!
భారత అంతరిక్ష చరిత్ర సిగలో కలికితురాయిలా అమరిన ‘మార్స్‌’ విజయ యాత్రని అమెరికా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగ స్వరంతో గుర్తుచేసుకొన్నారు. భారత శాస్త్రవేత్తల విజయానికి గల అపురూపమైన విలువని అభిమానపూర్వకంగా ప్రస్తావించారు. ‘‘అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లో ఒక కిలోమీటర్‌ దూరానికి ఆటోవాళ్లు పది రూపాయలు వసూలు చేస్తారు. కానీ, అంతే దూరానికి కేవలం 7రూపాయల వంతున ఖర్చుతోనే అరుణ గ్రహం చేరాం. ఇది భారత్‌ శాస్త్రవేత్తల సమర్థత కాదా?’’ అని ప్రశ్నించారు. పైగా.. తొలి ప్రయత్నంలోనే అరుణగ్ర హాన్ని ముద్దాడిన దేశం కూడా భారతేనని గుర్తు చేశారు. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లే అరుణగ్రహంపై అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడిక అమెరికా, భారత్‌లు భువిపైనే కాదు.. అరుణగ్రహం మాధ్యమంగా దివిలోనూ సంభాషించుకుంటాయి’ అని చమత్కరించారు. 
 భారతీయ సంతతికి శాశ్వత వీసాలు
- పీఐఓ, ఓసీఐ కార్డుల విలీనం
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయులు ప్రపంచ యవనికపై భారత్‌ అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షను మీరు నెరవేరుస్తారన్న విశ్వాసం నాకుంది. మీరు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగస్వాములుకావడం ద్వారా దాన్ని నెరవేర్చండి.’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ వద్ద ఉన్న ఫోన్‌, లాప్‌టాప్‌ నుంచి ఝడజౌఠి.జీుఽ లోకి లాగిన్‌ అవ్వడం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు’ అని సూచించారు. 
‘మహాత్మాగాంధీ కూడా ప్రవాసభారతీయుడే. ఆయన 1915 జనవరిలో భారతదేశానికి తిరిగివచ్చారు... దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆ అద్భుతఘట్టానికి వచ్చే ఏడాదితో వందేళ్లు నిండుతాయి. భారతీయ సంతతి(పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌- పీఐఓ) వారు స్వదేశానికి వచ్చి ఎక్కువ కాలం ఉండాలనుకుంటే పోలీసుస్టేషన్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉందని, వారికి ఇకపై అలాంటి కష్టాలు ఉండబోవని హామీ ఇచ్చారు. పీఐఓ కార్డుదారులకు శాశ్వత వీసాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. 
పీఐఓ కార్డులను, ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డులను కలిపి ఒకే కార్డును అందించే ఆలోచన కూడా ఉందన్నారు. అమెరికన్‌ పర్యాటకులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎందరో ప్రవాసభారతీయులు భారత్‌కు వచ్చి, తన తరఫున ప్రచారంలో పాల్గొన్నారని, అప్పుడు వారికి ధన్యవాదాలు చెప్పలేకపోయానని గుర్తు చేసుకున్న మోదీ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లోని వారి కంటే విదేశాల్లోని భారతీయులే ఫలితాల పట్ల ఎక్కువగా సంబరాలు చేసుకున్నారని అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...