Sunday, November 8, 2015

మహాకూటమి కే బీ'హారం'...

పట్నా, నవంబర్  8;  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌ల మహా కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహా కూటమి 178 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమి 58 సీట్లను దక్కించుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూ  ఈ  ఎన్నికలలో మిత్రపక్షాలుగా మారాయి. ముఖ్యంగా ఓబీసీ వర్గాల ఓటర్లపై  మహా కూటమి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయి.  70శాతం ఓబీసీ ఓటర్లు మహాకూటమికి మద్దతు తెలపగా.. కేవలం 20శాతం ఓటర్లు మాత్రమే ఎన్డీయే కూటమికి ఓటు వేసినట్లు తేలింది. మిగిలిన 10శాతం ఓబీసీ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు. .మండల్‌ ప్రకటన అనంతరం దేశంలోని ఓబీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. ఓబీసీ నేతయైన లాలూ ప్రసాద్‌ బిహార్‌ ఓబీసీ వర్గాలకు ప్రతినిధిగా మారారు. రిజర్వేషన్లపై కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించడంతో దళితవర్గాలు కూడా ఆయనను అభిమానించాయి. దీంతో వారు తమ ప్రతినిధులుగా చెప్పుకునే మాంఝీ, పాస్‌వాన్‌ పార్టీలకు ఓటేయకుండా మహాకూటమి వైపు మళ్లినట్టు తెలుస్తోంది. 
మళ్లీ లాలూ ప్రభంజనం ... 
బిహార్ ఎన్నికల్లో లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పడిలేచిన కెరటంలా అనూహ్యంగా పుంజుకుంది. 80 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలువడంతో నితీశ్ ప్రభుత్వంలో లాలూ కింగ్‌ మేకర్ పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న లాలు తనయులు తేజస్వి (26), తేజ్ ప్రతాప్ (27)పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తేజస్వి రాఘోపూర్, తేజ్ ప్రతాప్ మహువా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో చిన్నవాడైన తేజస్వినే లాలు రాజకీయ వారసుడిగా భావిస్తున్నారు.నితీశ్ ప్రభుత్వంలో ఈ ఇద్దరు యువనేతలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. జేడీయూ కన్నా అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ సీఎం పీఠాన్ని నితీశ్‌కు విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆర్జేడీ అత్యధిక క్యాబినెట్‌ బెర్తులను కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో లాలు తనయులు ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

15 ఏళ్ల తర్వాత ఆర్జేడీ మళ్లీ బిహార్ ఎన్నికల్లో సత్తా చాటింది. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థితికి ఎదిగింది. అయితే, దాణా కుంభకోణంలో శిక్షపడటంతో లాలూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన నేరుగా పదవులు చేపట్టే అవకాశం లేకపోవడంతో లాలు తనయులే ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పుతారని భావిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...