Friday, November 13, 2015

పారిస్ పై ఉగ్రవాద పంజా .... 150 మందికి పైగా బలి

పారిస్‌,నవంబర్ 14;  పారిస్‌ నగరంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. నగరంలోని పలు చోట్ల ఉగ్రవాదులు విచక్షణారహితంగా పేలుళ్లు, కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో దాదాపు 150 మంది  పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగాగాయపడ్డారు. 100మందిని ఒకేచోట బంధించి బాంబులతో పేల్చేశారు. ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్‌లలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు పోలీసులు కూడా తీవ్రంగాప్రయత్నించారు. పారిస్‌ బతక్లాన్‌ సమావేశ మందిరం వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఫ్రెంచి మీడియా పేర్కొంది. పారిస్‌ స్టేడియం వద్ద రెండు ఆత్మాహతి దాడులు, ఒక బాంబు పేలుడు జరిపినట్టు పోలీసులు  వెల్లడించారు.ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పారిస్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హొలాండ్‌ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు.పారిస్‌లో జరిగిన కాల్పులు మానవత్వంపై జరిగిన దాడులుగా అమెరికా అధ్యక్షుడు ఒబామా అభివర్ణించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని అమానవీయ చర్యగా వ్యాఖ్యానించారు. జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కల్‌ కూడా ఉగ్రవాదుల చర్యలను ఖండించారు. 
భారత్ దిగ్భ్రాంతి ....
బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ... పారిస్‌లో ఉగ్రదాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి ఘటన తీవ్ర మనోవేదన, క్షోభకు గురి చేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేలుళ్లలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాక్షించారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...