Thursday, January 17, 2013

డీజిల్ అంటుకుంది...

న్యూఢిల్లీ, జనవరి 18: పెట్రోలు తరహాలో డీజిల్ ధరలపైనా నియంత్రణను ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గురువారం  నిర్ణయం తీసుకుంది. సమయానుకూలంగా డీజిల్ ధరలను పెంచుకునేందుకు చమురు కంపెనీలకు అవకాశమిచ్చింది. దీంతో రిటైల్‌లో కొనే వినియోగదారులకు ప్రతి నెలా 50 పైసల చొప్పున(స్థానిక పన్నులు కలిపి) డీజిల్ ధర పెరగనుంది. తొలి దశగా.. గురువారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. అదేసమయంలో గంపగుత్తగా కొనే రైల్వే, ఆర్టీసీ లాంటి సంస్థలకు ఇలా దశలవారీ కాకుండా ఒకేసారి లీటరుకు దాదాపు రూ.10 చొప్పున పెంపు అమలు కానుంది.  దీంతో ప్రజా రవాణా చార్జీలు భారీగా పెరిగే అవకాశముంది.  కాగా ఇదే సమయంలో పెట్రోలు ధరలను లీటరుకు 25 పైసల చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించడం గమనార్హం. వ్యాట్‌తో కలుపుకొంటే మరో 5 పైసలు అదనంగా తగ్గే అవకాశముంది. డీజిల్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.9.60 సబ్సిడీని( లీటరుకు) ఎత్తి వేయాలని, నెలకు రూ.1 చొప్పున పెంచడం ద్వారా ఈ సబ్సిడీ తొలగించాలని కొంతకాలం కిందట విజయ్ కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకునే క్యాబినెట్ కమిటీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
 
ఇక 9 సిలిండర్లు 

 గృహావసరాలకు ఉద్దేశించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్య ను 6 నుంచి 9కి(ఏడాదికి) పెంచుతూ  ‘రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ’ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వెల రూ.410.50గా ఉంది. ఇకపై ఏడాదికి 9 సిలిండర్లు దాటితే.. మార్కెట్ ధరకే సిలిండర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 వరకు సామాన్య వినియోగదారుడు 3 సబ్సిడీ సిలిండర్లు పొందడానికి అవకాశముండగా.. తాజానిర్ణయం ప్రకారం 5 సిలిండర్లు తీసుకోవడానికి చాన్సుంది. మార్చి 31 ముగిసిన తర్వాత ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు పొందవచ్చు. 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...