టై గా ముగిసిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్
బెంగళూరు,ఫిబ్రవరి 27: వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ టై గా ముగిసింది. భారత్ విసిరిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఎంతో టెన్షన్‌గా సాగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఇరుజట్లకు చేరో పాయింట్ వచ్చింది. భారత్ విసిరిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకె ళ్లిన స్ట్రాస్, బెల్ జోడి జోరుకు స్ట్రైకింగ్ బౌలర్ జహీర్ ఖాన్ ఒక్కసారిగా కళ్లేం వేశాడు. 42వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లిష్ టీం వెన్ను విరిచాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ నీదా-నాదా అనేరీతిలో దోబుచులాడింది. చావ్లా వేసిన 48వ ఓవర్‌లో టెయిల్ ఎండర్లు బ్రాసన్, స్వాన్‌లు తలో సిక్స్ బాదడంతో మ్యాచ్ ఉత్కంఠకు చేరింది. మునాఫ్ వేసిన చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సి ఉండగా షాజద్ ఓ సిక్స్ చేశాడు. దీంతో చివరి బంతికి గెలుపు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ...