Saturday, March 7, 2015

ప్రత్యేక హోదా తోనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యం...గవర్నర్

హైదరాబాద్‌, మార్చి 7 : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉంటుందని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించారు.విభజనతో ఏపీకి ఆర్థిక లోటు ఏర్పడిందని తెలిపారు. సంక్షోభంలోనే అవకాశాలు వెదుకుతున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలిస్తామని కేంద్రం చెప్పిందన్న గవర్నర్‌ ఇతర రాష్ర్టాలతో ధీటుగా నిలబడాలంటే అది ఏపీకి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని పేర్కొన్నారు.కేంద్రం నుంచి మరింత సహకారం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.  ఏపీ సమగ్రాభివృద్ధి కోసం 7 మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. 
 
హుద్‌హుద్‌ తుపాను నష్టానికి కేంద్రం వెయ్యి కోట్లు ప్రకటించినా ఇప్పటి వరకు రూ.650 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని గవర్నర్‌ సభలో తెలియజేశారు. 2015-16లో ఏపీలో నాలుగు కొత్త ఓడరేవులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. ఆగ్నేయాసియాకు ఏపీని ముఖద్వారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2015-16లో రైతులకు 10వేల సోలార్‌ పంపుసెట్లను పంపిణీ చేస్తామన్నారు. 
 
ఉద్యానవన రైతులకు ఎకరాకు రూ.10 వేల రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి తెల్లరేషన్‌కార్డుదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని...పోలీస్‌స్టేషన్లు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పటు చేసినట్లు తెలిపారు. స్మార్ట్‌ ఏపీలో భాగంగా స్మార్ట్‌ కార్డు, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాలు చేపట్టినట్లు గవర్నర్‌ అన్నారు. జన్మభూమి, మా ఊరు పథకాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. 2014-15లో ఆర్థికాభివృద్ధి 7.21 శాతంగా ఉందని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి విజన్‌ 2050 డాక్యుమెంట్‌ రూపకల్పన చేస్తామన్నారు. 
 
వృథాగా పోతున్న గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గవర్నర్‌ తెలిపారు. రెండో దశ రుణమాఫీ కోసం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. పోలవరానికి కేంద్రం రూ.100 కోట్లు కేటాయించి నిరాశపర్చిందని వ్యాఖ్యానించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గవర్నర్‌ తేల్చి వెల్లడించారు. 
 
బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో...చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం తొలిస్థానంలో ఉందన్నారు. ఆక్వాకు ఏపీని కేపిటల్‌గా మారుస్తామని గవర్నర్‌ తెలిపారు. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం అమెరికా, ఆస్ర్టేలియా, జపాన్‌ల సాయం తీసుకోనున్నట్లు చెప్పారు. 
 
గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో గిరిజన యువతుల పెళ్లికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దళారీ వ్యవస్థను ఆరికడతామని, అవినీతి రహిత పాలన అందజేస్తామని గవర్నర్‌ స్పష్టం చేశారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను ఆధునీకరిస్తామన్నారు. ఏపీలో ప్రతి ఇంటికి గ్యాస్‌ పైప్‌లైన్‌ వేయనున్నట్లు చెప్పారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. 
 
గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగు లో మొదలెట్టి ఇంగ్లిష్ లో కొనసాగించి చివర తెలుగు లో ముగించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...