Tuesday, June 3, 2014

కొలువుదీరిన కేసీఆర్...12మందితో ప్రభుత్వ ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ తొలి ప్రభుత్వం 12మందితో కొలువుదీరింది. సోమవారం ఉదయం 8.20కి రాజ్‌భవన్‌లో కె చంద్రశేఖర్‌రావుచేత ముఖ్యమంత్రిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా నాయిని నర్సింహ్మారెడ్డి (హైదరాబాద్), ఈటెల రాజేంద్ర (కరీంనగర్), టి హరీశ్‌రావు (మెదక్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (నిజామాబాద్), మహమూద్ అలీ (హైదరాబాద్), టి రాజయ్య (వరంగల్), కల్వకుంట్ల తారక రామారావు (కరీంనగర్), టి పద్మారావు (హైదరాబాద్), మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), జి జగదీశ్‌రెడ్డి (నల్లగొండ), జోగురామన్న (ఆదిలాబాద్)లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 12 మందితో కూడిన మంత్రివర్గంలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చారు. మైనారిటీ కోటా కింద మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మహమూద్ అలీని, వరంగల్ జిల్లా నుంచి గెలిచిన దళిత వర్గానికి చెందిన టి రాజయ్యను ఉప ముఖ్యమంత్రులు చేశారు.  కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కేబినెట్‌లో నలుగురు రెడ్లు, ముగ్గురు వెలమలు ఉన్నారు. ఈటెల రాజేంద్ర, టి పద్మారావులు బీసీలు కాగా, ఎస్సీ వర్గం నుంచి జోగు రామన్న, రాజయ్యలకు అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం కల్పించలేదు. అదేవిధంగా మహిళలకూ ప్రాధాన్యత దక్కలేదు.
నాయినికి కీలక హోం శాఖ.....హరీశ్‌కు సాగునీటిపారుదల....కేటీఆర్‌కు ఐటి, పంచయతీరాజ్
 తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు, మున్సిపాలిటీ పరిపాలన- పట్టణాభివృద్ధి, ఎనర్జీ, కోల్, జిఎడిలతోపాటు మంత్రులకు కేటాయించని శాఖలను నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి రెవెన్యూ, సహాయ, పునరావాసం, అర్బన్ ల్యాండ్ సీలింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. నాయిని నర్సింహ్మారెడ్డికి హోంశాఖ, జైళ్లు, ఫైర్ సర్వీస్, సైనిక సంక్షేమం, కార్మిక ఉపాధి శాఖలు కేటాయించారు. ఈటెల రాజేందర్‌కు ఆర్థిక, ప్రణాళిక, చిన్నతరహా పొదుపు మొత్తాలు, లాటరీలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖలు కేటాయించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, పశు సంవర్థక శాఖ, ఫిషరీస్, డైయిరీ డెవలప్‌మెంట్, సీడ్స్ కార్పొరేషన్ శాఖలు కేటాయించారు.టి హరీశ్‌రావుకు సాగునీటిపారుదల, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాలు, టి పద్మారావుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్పగించారు. పి మహేందర్‌రెడ్డికి రవాణా శాఖ, కల్వకుంట్ల తారక రామారావుకు పంచాయతీరాజ్, ఐటి శాఖలు అప్పగించారు. జోగు రామన్నకు అటవీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ అప్పగించారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...