Thursday, June 19, 2014

విభజన తర్వాత తెలంగాణలో ఇంధన కొరత...

హైదరాబాద్, జూన్ 19 :  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  విభజనకు ముందు విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ నుంచి రామగుండం, వరంగల్ ఐఓసీ డిపోలకు రైల్వే ట్యాంకర్లద్వారా ఇంధనం సరఫరా అయ్యేది. ఆయా డిపోల నుంచి జిల్లాల్లో ఉన్న పెట్రోల్ బంకులకు ట్యాంకర్లతో పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేసేవారు. విజయవాడ ఐఓసీ మెయిన్ పాయింట్ నుంచి వరంగల్ డిపోకు... హైదరాబాద్ చర్లపల్లి నుంచి రామగుండం డిపోకు రైల్యే ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజీల్ వచ్చేది. వరంగల్ డిపో నుంచి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పెట్రోల్ బంక్‌లకు, రామగుండం డిపో నుంచి కరీంనగర్ , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు డీజీల్, పెట్రోల్ పంపిణీ అయ్యేది. అయితే విభజన తర్వాత విజయవాడ మెయిన్ పాయింట్ నుంచి వరంగల్ డిపోకు సరఫరా నిలిచిపోయింది. రామగుండంలోని ఐవోసీలో స్టాక్ లేకపోవడంతో ఆ ప్రభావం పంపిణీపై పడింది. మూడు జిల్లాలకు కేటాయించాల్సిన ఇంధనాన్ని ఆరు జిల్లాలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. రామగుండం డిపో నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు 4 వేల లీటర్ల పెట్రోల్, 20 వేల లీటర్ల డీజిల్ సరిపోయేది. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేయాల్సి రావడంతో డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. విజయవాడ నుంచి ట్యాంకర్లు వస్తే అధిక టాక్స్ పడుతుందనే ఉద్దేశంతో ఆయిల్ ట్యాంకర్లు సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...