Friday, October 25, 2013

మధుర గాయకుడు మన్నాడే కన్నుమూత..

బెంగళూరు, అక్టోబర్ 25 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే... హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలిగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది.   క్లాసికల్, రొమాంటిక్, కామెడీ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన పాటలతో సినీ సంగీతాభిమానులను రసడోలలూగించిన మన్నాడే (94) మధుర స్వరం మూగబోయింది!! నాలుగునెలలుగా ఊపరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3.50 గంటలకు కన్నుమూశారు.  మన్నాడేకు ఇద్దరు కుమార్తెలు షురోమా, సుమిత ఉన్నారు.  మన్నాడే భార్య సులోచన కుమరన్ 2012 జనవరిలో కేన్సర్‌తో కన్నుమూశారు. మన్నాడే అసలు పేరు ప్రబోధ్ చంద్ర డే. 1919 మే 1న పూర్ణచంద్ర డే, మహామాయా డే దంపతులకు కోల్‌కాతాలో జన్మించారు. సంగీతాచార్యుడైన తన బాబాయి కృష్ణచంద్ర డే, ఉస్తాద్ డబీర్ ఖాన్, ఉస్తాద్ అమన్ అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ రహమాన్‌ఖాన్‌ల వద్ద చిన్న వయసునుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. పదో ఏట నుంచే బాలగాయకుడిగా స్టేజీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కాలేజీ రోజుల్లో రెజ్లింగ్, బాక్సింగ్ కూడా నేర్చుకుని కుస్తీపట్లు పట్టినా.. పాటను మాత్రం ఏ దశలోనూ వదల్లేదు. వరుసగా మూడేళ్లపాటు అంతర్‌కళాశాలల పాటల పోటీల్లో విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. తొలుత బారిస్టర్ కావాలనుకున్న మన్నాడే.. తన బాబాయి సలహాతోనే సంగీతాన్నే జీవికగా మలుచుకున్నాడు. ఆయనకు 'మన్నా డే' అనే పేరు పెట్టింది.. 1943లో తమన్నా చిత్రంలో సురయ్యాతో సూపర్‌హిట్ యుగళగీతాన్ని ఆలపించే అవకాశాన్ని ఇచ్చిందీ కృష్ణ చంద్ర డేనే కావడం విశేషం.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...