Friday, October 4, 2013

విభజన దిశగా మరో అడుగు... నోట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4:  ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సి. డబ్ల్యు.సి. నిర్ణయానికి   కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర పడింది.  ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రతిపాదించిన కేబినెట్‌ నోట్‌ను గురువారం ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన మంత్రవర్గ సమావేశం ఆమోదించింది. తద్వారా రాష్ట్ర విభజనకు, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు అధికారికంగా కేంద్రం శ్రీకారం చుట్టింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ పదేళ్ల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం ఆమోదించింది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు 9 మంది మంత్రులతో కూడిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన చట్ట, పాలనాపరమైన యంత్రాంగం రూపకల్పనతో పాటు నదీజలాలు, జల వనరులు, విద్యుత్‌ పంపిణీ వంటి విభజనతో ఉత్పన్నమయ్యే అన్ని అంశాలు, సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటికి పరిష్కార మార్గాలు చూపడమే గాక సమైక్య రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను మంత్రుల బృందానికి  అప్పగించారు. అలాగే విభజన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం ఆర్థికంగా ఎలాంటి సహాయాన్ని, ఎంతమేరకు అందజేయాలన్న అంశాన్ని కూడా జీఓఎం చూస్తుంది. రెండు రాష్ట్రాల్లోని వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది. వీటితో పాటు విభజన ప్రక్రియలో భాగంగా మున్ముందు తలెత్తే అన్ని అంశాలనూ అది పరిశీలిస్తుంది. అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదికను జీఓఎం సమర్పిస్తుంది. అంతేగాక ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన బిల్లును కూడా అదే తయారు చేస్తుంది. దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక రాష్టప్రతికి పంపుతారు. అనంతరం బిల్లును ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక దాన్ని రాష్టప్రతి తన ఆమోదంతో పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదించి, దానిపై రాష్టప్రతి ఆమోద ముద్ర కూడా పడగానే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...