Saturday, December 1, 2012

దంపతుల అరెస్ట్ పై నార్వే వివరణ...

ఓస్లో, డిసెంబర్ 1 : నార్వేలోని ఓస్లోలో తెలుగు దంపతులు చంద్రశేఖర్, అనుపమల అరెస్ట్ పై నార్వే పోలీసులు ప్రకటన చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించారని, వారు అనేకసార్లు ఇలానే వ్యవహరించారని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు నార్వే పోలీసులు పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోతారనే వారిని రిమాండ్ లో ఉంచినట్లు తెలిపారు. సోమవారం  ఓస్లో జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. కాగా, పిల్లవాడిని  కొట్టాడనే ఆరోపణపై నార్వేలో అరెస్టయిన తెలుగు దంపతుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్ నగరానికి చెందిన  వి.చంద్రశేఖర్ టిసిఎస్  కు చెందిన కంపెనీలో ఉద్యోగి. తమ అబ్బాయి పదే పదే స్కూలు నుంచి ఇతరుల బొమ్మలు తెస్తుండటంతో చంద్రశేఖర్ అతడిని మందలించారు. దానిపై ఆ అబ్బాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడమే కాక.. తిరిగి భారత్‌కు పంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా వారికి చెప్పాడని చంద్రశేఖర్ తమ్ముడి కొడుకు శైలేందర్ తెలిపారు.దీనిపై విచారించిన అక్కడి అధికార వర్గాలు చంద్రశేఖర్, అనుపమలు తమ పిల్లవాడికి చెమ్చాకు బదులు చేత్తో అన్నం పెడుతున్నారని, ఇలా అనేక రకాల తప్పులను ఎత్తి చూపారు. అయితే తాము అన్ని తప్పులు చేసినట్లు ఆ దంపతులకు తెలీదు. కానీ తొమ్మిది నెలల తర్వాత దంపతులిద్దరూ అరెస్టయ్యారు. తమ బాబాయికి అసలు కేసు గురించి తెలియదని, తమ పిన్నిని, పిల్లలను తీసుకుని జూలైలో హైదరాబాద్ వచ్చి, తిరిగి అక్టోబర్ చివరి వారంలో ఓస్లో తిరిగి వెళ్లారని, అప్పుడే భార్యతో సహా తమ ముందు హాజరు కావాల్సిందిగా అక్కడి అధికారులు నోటీసు ఇచ్చారని శైలేందర్ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...