Monday, August 11, 2014

ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి... విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి  ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, ఆగస్టు 11 : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి  ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అడ్మిషన్లు జరగాలని, ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని థర్మాసనం తెలంగాణ సర్కార్‌ను  ఆదేశించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్థానికత అంశం ఈ కేసు పరిధిలోకి రాదని సుప్రీం పేర్కొంది. ఈ  ఏడాది వరకే ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పదేళ్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే అడ్మిషన్లు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానికత విషయంలో 371 డి ప్రకారమే అడ్మిషన్లు జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.  కాగా, ఈ నెల 4న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి  ఆ రాష్ట్రంలోని  13 జిల్లాల్లో ఎంసెట్‌ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం సోమవారం కోర్టు ఇచ్చే తుది తీర్పుకోసం ఎదురుచూసింది.  ఎంసెట్‌ అడ్మిషన్లు నిర్వహించేందుకు సిబ్బంది కొరత ఉందని అక్టోబర్‌ నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏఐసీటీఈ, ఏపీ సర్కారు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో  ఇంప్లీడ్‌ పిటీషన్లు వేశాయి.  ఏపీ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆగస్టు 31లోగా అడ్మిషన్లు పూర్తి చేసి సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఇక  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో  టీ సర్కారు ఎంసెట్‌ అడ్మిషన్ల షెడ్యూలు ఖరారు చేయనుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...