Thursday, August 14, 2014

తెలంగాణ సర్వేకు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి...

బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత వివరాలకోసం పట్టుపట్టవదని కోర్టు ఆదేశం... 
సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే అన్న సర్కార్.. 

హైదరాబాద్, ఆగష్టు 14 : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేకు  హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. వివరాల కోసం ప్రజలపై ఒత్తిడి తేవద్దని స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యంతరం చెబితే వదిలివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత వివరాలకోసం పట్టుపట్టవదని కోర్టు సూచించింది. సమగ్ర సర్వేపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. సర్వే తప్పనిసరికాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. సమగ్ర సర్వే స్వచ్చంధంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడడంలేదని, సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే చేస్తున్నట్లు ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తూ సీతాలక్ష్మి అనే న్యాయవాడి కోర్టును ఆశ్రయించారు. ఇది చట్ట వ్యతిరేకమని, దీనికి చట్టబద్ధత లేదని, ఇటువంటి సర్వేను కేంద్రప్రభుత్వం మాత్రమే చేయాలని, ఎవరు పడితే వారు చేయకూడదనే కోణంలో వారు పిటిషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్లు, వాహనాలు, కులం, ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు వచ్చారు, తదితర విషయాలు సర్వే ఫార్మాట్‌లో ఉన్నాయని, ఈ రకంగా వ్యక్తుల వివరాల్లోకి చొరబడడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ప్రజా శ్రేయస్సుకోసం, సంక్షేమపథకాల అమలు కోసమే సర్వే నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అంతే తప్ప ప్రజలపై ఒత్తిడి తీసుకురాబోమని, ఇది తప్పనిసరికాదని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి కాదని అంటోంది కాబట్టి ప్రజలకు ఇష్టమైతేనే ఎన్యూమరేటర్స్‌కు వివరాలు ఇవ్వాలని, లేదంటే ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు. ప్రజలు సహకరిస్తేనే వివరాలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...