Tuesday, August 12, 2014

తాత్కాలిక రాజధానిగా బెజవాడ...

హైదరాబాద్, ఆగస్టు 12: కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశల వారీగా విజయవాడకు తరలించాలని సూచించారు. రాష్ట్రానికి నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మరో వారం రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనున్న తరుణంలో.. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీతో  చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలని, అన్ని ప్రధాన శాఖల కార్యాలయాలు తాత్కాలిక రాజధాని నగరంలో ఉండేలా చూడాలని  చంద్ర బాబు అధికారులను ఆదేశించారు. ప్రజలతో సంబంధం ఉన్న శాఖల అధిపతుల కార్యాలయాలను తొలుత విజయవాడ తరలించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఆ తరువాత దశల వారీగా మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాలను తరలించాలని చెప్పారు.   ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటి పారుదల శాఖ కార్యకలాపాల కోసం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర స్థాయి సమీక్షలు మొత్తం విజయవాడలోనే సాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ నుంచే తన శాఖ కార్యకలాపాల వేగం పెంచారు. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తన క్యాంపు కార్యాలయంతో పాటు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని పోరంకిలో దేవాదాయశాఖ నిర్మించిన వృద్ధాశ్రమం భవనాలను తన క్యాంపు కార్యాలయంగా, ఆ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలుగా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ఏర్పాట్లలో పడ్డారు. గృహ నిర్మాణ, అటవీ, పంచాయితీరాజ్, రహదారులు, భవనాల శాఖలను తొలుత తరలించే అవకాశం ఉంది.  ఇక గన్నవరం సమీపంలోని ‘మేథా టవర్స్’లో రాష్ట్ర స్థాయిలోని 11 శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవ నంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయడం కోసం కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నివేదిక కూడా కోరింది. ఇక్కడ రవాణా, ఐటీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, సహకార, ఆర్ అండ్ బీ, విద్య, వ్యవసాయ, ఎక్సైజ్, సంక్షేమ, వాణిజ్య పన్నుల శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు  సమాచారం.  అలాగే.. గన్నవరంలోని ప్రాంతీయ శిక్షణా కశాశాలలోని 25 ఎకరాల స్థలంలో ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. దీంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ఈ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కేటాయించేందుకు పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయవాడకు సమీపంలో అద్దెకు తీసుకోవడానికి అనువైన భవనాలు ఏమున్నాయో వాటి వివరాలను కూడా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం నుంచి సేకరిస్తోంది.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...