Wednesday, May 28, 2014

అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకుపోతా....చంద్రబాబు

హైదరాబాద్, మే 28 : పోలవరం విషయంలో టీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తున్నదని,  అందరం కలిసి కేంద్రంపై పోరాడి అభివృద్ధి చేసుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. బుధవారం మహానాడులో ఆయన ప్రసంగిస్తూ... అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకుపోతామని అన్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తల సహాయం కోసం ప్రత్యేక నిధి పెట్టాలన్న టీడీపీ యువనేత లోకేష్ నాయుడు సూచన బాగుందని, రూ. 20 కోట్లతో నిధిని ప్రారంభిస్తామని  చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఢిల్లీలో అనేక అవమానాలకు గురయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయమంటే తనను ఎగతాళి చేశారని, రెండు కళ్ల సిద్ధాంతమని ఎద్దేవా చేశారని ఆయన తెలిపారు. ఏపీ భవన్‌లో నిరాహార దీక్ష చేస్తుంటే కరెంట్ కట్ చేశారని, తెలంగాణ కావాలో... ఆంధ్రా కావాలో తేల్చుకోవాలంటూ చాలా మంది తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని ఒత్తిడిలు తీసుకువచ్చినా భయపడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కుట్ర పన్నిన పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందని  చంద్రబాబు వ్యాఖ్యానించారు.  సినీనటుడు, జనసేన అ«ధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి కూడా తెలుగుజాతి ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీలకు సహకరించారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో  కూడా పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలోనూ కేసులు ఎత్తివేతకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీని జాతీయ పార్టీగా తీసుకువస్తామని, వచ్చే ఎన్నికల్లో ఆరేడు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...