Monday, November 18, 2013

జీవోఎం ఎదుట సి.ఎం.' సమైక్య ' వాదన

న్యూఢిల్లీ, నవంబర్ 18: రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య తీవ్రమవుతుందని  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవోఎంతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవోఎంకు రెండు పుస్తకాలు  అందించిన ఆయన, తాను నివేదించిన అంశాల గురించి వెల్లడించారు. ఆ అంశాలివీ..
    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికంటే తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. పారిశ్రామికంగా హైదరాబాద్ ఎంతో ఎదిగింది. ముఖ్యంగా ఫార్మా, ఇతర భారీ పరిశ్రమలు చాలా ఏర్పడ్డాయి.    హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా విద్య, వైద్య పరమైన అవకాశాలు ఉన్నందున సీమాంధ్ర ప్రజలకు సమస్యలు ఏర్పడతాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు.
    గత పదేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య నక్సలిజమేనని ప్రధాని గతంలో కనీసం ఆరేడుసార్లు చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలంతా రాష్ట్రానికి చెందినవారే. నక్సలైట్లలో ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యులంతా ఏపీ వాళ్లే. విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య పెరుగుతుంది.   రాష్ట్రంలో ఉగ్రవాదుల నుంచి కూడా పెద్ద సవాల్ ఎదురవుతోంది. విభజన వల్ల పోలీస్ వ్యవస్థ బలహీనపడుతుంది. హైదరాబాద్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గణేశ్ చవితి లాంటి పెద్ద పండగ ఏమైనా వస్తే జిల్లాల నుంచి 25 వేల మంది పోలీసులను హైదరాబాద్ కు తెస్తాం. అలాంటిది ఇప్పుడు విభజిస్తే అలాంటి పండుగల నిర్వహణే కష్టమైపోతుంది.
    హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం ఉంది. ఇటీవల ఎన్నో ఉద్యమాలు జరిగినా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ మీదే ఆధారపడుతున్నారు. ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతికూల ప్రభావం పడుతుంది.
    విభజన వల్ల సాగునీటి సమస్య తీవ్రమవుతుంది. కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే వివాదాలున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వీటిని వాడుకుంటున్నారు. సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా రైతులు కృష్ణా జలాలతో సాగు చేస్తున్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాల రైతులు నష్టపోతారు.
    విద్యుత్ పంపిణీలో కూడా చాలా సమస్యలు తప్పవు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును ఎవరెవరు ఎంతెంత పంచుకోవాలన్న సమస్య వస్తుంది. దాంతోపాటు విద్యుత్ ఇరు ప్రాంతాల మధ్య విద్యుత్ పంపిణీలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకే అజమాయిషీలో విద్యుత్ పంపిణీ ఉంటే పర్వాలేదు. కానీ రెండు రాష్ట్రాలైతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో ఉండే విద్యుత్ ప్రాజెక్టులకు విద్యుత్ ఎక్కడ నుంచి ఇవ్వాలి?
    ట్రిబ్యునళ్లు ఉండటం వల్ల సాగునీటి విషయంలో ఇప్పటికే చాలా వివాదాలున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో ఇప్పటికే గొడవలున్నాయి.
    16 శాతం ఉద్యోగాల కోసం, 53 శాతం వ్యాపారం కోసం, మిగిలినవారంతా చదువు కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాయి.
    ప్రభుత్వోద్యోగాల్లో ప్రాంతాలవారీగా రిజర్వేషన్లుంటాయి. విభజన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఇతర ప్రాంతాల ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వాళ్లంతా ఎక్కడికెళ్లాలన్న సమస్య వస్తుంది. 


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...