Tuesday, November 12, 2013

యు.పి.ఎ. 2 హయాం లోనే తెలంగాణా బిల్లు: షిండే

న్యూఢిల్లీ, నవంబర్ 12:  ప్రస్తుత యూపీఏ ప్రభుత్వ హయాం 2014లో ముగిసేలోగానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. అయితే, ఈ బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతారా లేదా అనే అంశంపై ప్రశ్నలకు ఆయన స్పష్టంగా బదులివ్వలేదు. రాజ్యాంగం ప్రకారం బిల్లును పార్లమెంట్‌లో పెడతామని, అక్కడ ఆమోదం పొందే అంశంపై తానేం మాట్లాడలేనని అన్నారు.  విభజనపై కేబినెట్ తమకు అప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి మంత్రుల బృందం(జీవోఎం) ప్రయత్నిస్తోందని షిండే అన్నారు. ఎప్పటిలోగా బిల్లు అసెంబ్లీకి వెళ్తుందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘ప్రక్రియ నడుస్తోంది. ఇది కాగానే మేం కేబినెట్‌కు నివేదిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి నుంచి బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తుంది’’ అని చెప్పారు. హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు జీవోఎం ముందుకు వచ్చాయని, వాటన్నింటినీ జీవోఎం పరిశీలిస్తోందని షిండే చెప్పారు. ఆర్టికల్ 371డీ విషయంలో జీవోఎం సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్‌లో ఏ పరిధివరకు ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారని ప్రశ్నించగా, రెవెన్యూ జిల్లావరకు పరిగణించాలని, కమిషనరేట్‌నే తీసుకోవాలని రకరకాల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తమ ముందుకు వచ్చాయని, వాటిని తాము పరిశీలిస్తున్నామన్నారు.  కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో జీవోఎం పలు సమస్యలపై సవివరంగా చర్చిస్తోందని షిండే తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...