Saturday, September 7, 2013

అంతం కాదు...ఆరంభం: ఏపి ఎన్జీఓ

హైదరాబాద్ ,సెప్టెంబర్ 7 : ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రశాంతంగా ముగిసింది.   మూడు గంటల కు పైగా సాగిన    సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి  వేల సంఖ్యలో  ఉద్యోగులు  తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్ జిఓ నేతలు  ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఉద్యోగులు కూడా సభకు  పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించకపోవడంతో  వారు బయటే ఉండి నిరసన తెలిపారు.  ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన ఈ  సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ  స‌భ‌లో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామ‌ని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ స‌భ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభ‌న‌పై గ‌త కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభ‌జ‌న విష‌య‌మై టీఎన్జీవోలతో చ‌ర్చలు జ‌రిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేన‌ని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామ‌ని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామ‌ని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు.
తెలంగాణా బంద్ సంపూర్ణం...
కాగా, ఏపి ఎన్జీఓల స‌మైక్య స‌భకు వ్యతిరేకంగా టి.జె.ఎ.సి. నిర్వహించిన  తెలంగాణ బంద్ కూడా విజ‌య‌వంత‌మైంది. తెలంగాణ బంద్‌ 100 శాతం విజయవంతమయిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. 500 మందికి పైగా తెలంగాణావాదులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.  నిజాం కాలేజ్‌లో 200మందిని అరెస్ట్‌ చేసి గోషామహల్‌కు తరలించినట్లు తెలిపారు.మరో రెండు మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...