Wednesday, March 20, 2013

సబ్‌మెరైన్ నుంచి సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం

విశాఖపట్నం, మార్చి 21:  భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధిపరిచిన బ్రహ్మోస్ క్షిపణి మరో రికార్డు సృష్టించింది. 290 కిలోమీటర్ల పరిధి గల ఈ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ని విశాఖ తీరంలోని సబ్‌మెరైన్ నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించారు. నీటిలోపల సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ని ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ తన 290కిలోమీటర్ల పూర్తి పరిధిని చేరుకుందని దీన్ని అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సీఈవో ఎ.శివథాను పిళ్లై తెలిపారు.  ' బంగాళాఖాతం జలాల్లోని సబ్‌మెరైన్ నుంచి ఉదయం 9.30కి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లింది. 'ఎస్' ఆకారంలో విన్యాసం చేస్తూ నీటికి ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించి లక్షిత నౌకను ధ్వంసం   చేసింది. వర్టికల్ లాంచ్ కాన్ఫిగరేషన్‌లో సబ్‌మెరైన్లలో అమర్చడానికి బ్రహ్మోస్ క్షిపణి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది' అని పిళ్లై వెల్లడించారు. బ్రహ్మోస్‌ని ప్రయోగించడం ఇది 34వసారి. గత అక్టోబర్‌లోనూ 'ఐఎన్ఎస్ టెగ్' యుద్ధనౌక నుంచి డీఆర్‌డీవో  దీ నిని విజయవంతంగా పరీక్షించింది.
భూ ఉపరితలం, సముద్ర ఉపరితలం, ఆకాశంలోనూ ప్రయోగించగల సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌గా బ్రహ్మోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు నీటిలోనూ విజయవంతమైంది. అమెరికా, రష్యాలకు చెందిన వేర్వేరు జీపీఎస్ ఉపగ్రహాల ద్వారా బ్రహ్మోస్ క్షిపణి సమాచారాన్ని సేకరించగలదు. దీంతో లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యంత కచ్చితత్వం ఉంటుంది. చివరి నిమిషంలోనూ... కొద్ది మీటర్ల దూరంలోను లక్ష్యాన్ని గుర్తించే శక్తి దీని సొంతం. చాలా లక్ష్యాలు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాడి చేయగలదు. భూ ఉపరితలంపై అతి తక్కువ ఎత్తులో(10 మీటర్లు) దూసుకెళ్లి శత్రు రాడార్ల కంట పడకుండా లక్ష్యాన్ని ఛేదించ గలదు. 200కిలోల వార్‌హెడ్లను మోసుకెళుతూ ధ్వని వేగానికి 2.8 రెట్ల వేగంతో(మ్యాక్ 2.8) దూసుకెళ్లగలదు. ఆకాశంలో ప్రయోగించ గల బ్రహ్మోస్ అయితే 300కిలోల వార్‌హెడ్లను మోయగలవు. ఇక ప్రపంచంలోనే సూపర్‌సానిక్ వేగంతో స్థాన చలనంలో మార్పులు చేసుకోగల ఏకైక క్షిపణి బ్రహ్మోస్. ఇది ఇప్పటికే సైన్యం, నౌకాదళానికి అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వైమానిక దళానికీ అందనుంది. మరోవైపు హైపర్‌సానిక్ బ్రహ్మోస్-2 క్షిపణులను 2017కల్లా రూపొందించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇవి మ్యాక్ 5 నుంచి మ్యాక్ 7(గంటకు 6000 నుంచి 8500 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలవు. అమెరికా ఇటీవలే మ్యాక్ 5 వేగం గల క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వీటిని పునర్వినియోగించేలా కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు. అలాగే ప్రస్తుతం సుఖోయ్ యుద్ధ విమానాల కోసం రూపొందించిన బ్రహ్మోస్‌ను మిగ్ విమానాల్లోనూ వినియోగించే విధంగా బ్రహ్మోస్-3ని రూపొందించాలని కూడా రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ క్షిపణులను భారత్-రష్యాలు మాత్రమే వినియోగించుకుంటాయని, మూడో దేశానికి సరఫరా చేయమని బ్రహ్మోస్ ఏరోస్పేస్ స్పష్టం చేసింది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...