Friday, February 1, 2013

15 నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు

హైదరాబాద్, జనవరి 31: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  ‘ఎంసెట్’(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ సెట్)ను స్వల్పమార్పులు మినహా యథాతథంగా నిర్వహించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఈ నెల 8న విడుదల కానుంది. ఇప్పటివరకు ఓఎంఆర్(ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) షీట్లలో పెన్సిల్ ద్వారా సమాధానాలను పూరించాల్సి ఉండేది. ఈ సారి  నుంచి నీలం లేదా నలుపు రంగు పెన్నుతో మాత్రమే వాటిని పూరించాల్సి ఉంటుంది.  అలాగే  దరఖాస్తు పత్రంలో తల్లి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. పదో తరగతి వివరాలను హాల్‌టికెట్ నెంబరుతో సహా ఉత్తీర్ణత నెల, సంవత్సరం పూరించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం: రూ. లక్ష వరకు; రూ. 2 లక్షల వరకు; రెండు లక్షలకు పైబడి అనే గడులు ఉంటాయి. సరైన గడిని గుర్తించాలి. పదోతరగతిలో చదివిన మాధ్యమం రాయాలి. హైదరాబాద్‌లో పరీక్ష రాసేవారికి  హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా విభజించి  ప్రయోజనకరంగా మార్చారు. హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌లో 6 నియోజకవర్గాలను ప్రాంతీయ కేంద్రాలుగా వ్యవహరించనున్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ జోన్‌ను గుర్తిస్తే అభ్యర్థికి పరీక్షా కేంద్రం ఆ జోన్ పరిధిలోనే కేటాయిస్తారు. ఇవికాక ఇప్పటివరకున్న 26 ప్రాంతీయ కేంద్రాలకు తోడుగా కొత్తగా భీమవరం, చిత్తూరు, జనగామ, వనపర్తి పట్టణాల్లో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు రూ. 250. డెబిట్ కార్డు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డు ద్వారా గానీ, ఏపీఆన్‌లైన్, మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో  చెల్లించవచ్చు. ఈ నెల 15 నుంచి మార్చి 27 వరకు ఆన్‌లైన్లో  దరఖాస్తులను  స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు హాల్ టికెట్లను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 10న ఎంసెట్ పరీక్ష జరుగుతుంది.  12న కీ.. జూన్ 2న ర్యాంకులు ప్రకటిస్తారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...