Friday, March 14, 2014

కాంగ్రెస్ టార్గెట్ గా పవన్ జనసేన..

ప్రజలను విభజిస్తే తాట తీస్తా..
కాంగ్రెస్ తప్ప ఎవరితోనైనా కలుస్తా... 
జంపర్లు, జోకర్లు నాకొద్దు.... అభిమానులే బలం.... 
వ్యక్తిగత ఆరోపణలు చేస్తే అయిపోతారంతే... 
అందరికీ సమాన చట్టాలు....బ్లాక్ మార్కెట్ బంద్...మహిళలకు కనీసం పగలైనా భద్రత....మెరుగైన వైద్యసేవలు... 
హైదరాబాద్, మార్చి 14: కాంగ్రెస్ హటావో నినాదంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్  జనసేన పార్టీ ఆవిర్భవించింది.  నొవాటెల్ హోటల్ లో పవన్ కల్యాణ్  దాదాపు రెండు గంటల సేపు అభిమానులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకం కాదని ప్రసంగం మొదట్లోనే స్పష్టం చేసిన పవన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలా బాధాకరమని ఆయన తమ ప్రసంగంలో పదే పదే ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ సహా  చిదంబరం, షిండే, దిగ్విజయ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ జైరాం రమేష్ లను క్షమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక్క జాతిగా మెలిగిన ప్రజలు ఆ ప్రాంతం వారు, ఈ ప్రాంతం వారు అని పిలుచుకునే  దౌర్భాగ్య పరిస్థితి ని కాంగ్రెస్  తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. జాతీయ సమగ్రతకు  ఎవరు భంగం కలిగించినా తాట తీస్తానన్నారు. సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించే మొట్టమొదటి పిచ్చివాడిని తానే అంటూ దేశం నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పవన్ కల్యాణ్  పిలుపు ఇచ్చారు. .సమాజంలో మార్పు తేవడమే ధ్యేయంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో తప్పా..ఏ పార్టీతోనైనా చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని  స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఆ పార్టీపై పోరాటం ఆగదని తెలిపారు. ప్రస్తుతం తన పార్టీ నిర్మాణ దశలోనే ఉందని, పార్టీగా రూపాంతరం చెందడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా?లేదా? అని అంశంపై ఇంకా స్ఫష్టత లేదన్నారు.   ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, పదవులు తనకు చాలా తుచ్ఛమైనవని పవన్ పేర్కొన్నారు.  ' నేనున్న పరిస్థితి ఎలా ఉందంటే - ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం .. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు,, కాని గుండెల నిండా ధైర్యం ఉంది' 'అంటూ గట్టిగా నినదిస్తూ అభిమానులను ఉత్తేజపరుస్తూ పవన్  తొలుత తన ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిగా  పవన్ అభిమానులు  ఈ సభకు తరలి వచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...