Sunday, June 9, 2013

ఏడాది ముందే ఎమ్మెల్యే పదవులూడాయ్...

హైదరాబాద్,జూన్ 9; ఐదేళ్ల పదవీ కాలం నాలుగేళ్లకే ముగిసిపోయింది! కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఈ ఏడాది మార్చి 15వ తేదీన వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన ఎమ్మెల్యే పై వేటు పడింది. పార్టీల విప్‌ను ధిక్కరించి ఓటేసిన 15 మంది  ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రద్దు చేశారు. వీరిలో తొమ్మిదిమంది కాంగ్రెస్ సభ్యులు కాగా.. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. వేటు పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రంగారావు(బొబ్బిలి), ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి(కాకినాడఅర్బన్), ఆళ్ల నాని(ఏలూరు), ఎం.రాజేశ్(చింతలపూడి), జోగి రమేశ్(పెడన), పేర్ని నాని(మచిలీపట్నం), శివప్రసాద రెడ్డి(దర్శి), జి.రవికుమార్(అద్దంకి), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు). కాగా టీడీపీ సభ్యులు: పి.సాయిరాజ్ (ఇచ్ఛాపురం), పి.వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), ఎన్.అమర్నాథ రెడ్డి (పలమనేరు) ల సభ్యత్వాలు రద్దయ్యాయి. 

ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. అనర్హత వేటు పడిన 15 అసెంబ్లీ స్థానాలతోపాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతితో  కలిపి 16 స్థానాలకు ఇక ఖాళీ అయినట్టే. శాసనసభ్యులు లేరు. గతంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించినందుకు  19 మందిపై స్పీకర్ వేటు వేశారు. ఈసారి 15 మంది సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో, మొత్తం 34 మంది అనర్హులు అయినట్లయింది. ఒక శాసనసభ కాలంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది అనర్హతకు గురి కాలేదని స్పీకర్ మనోహర్ కూడా వివరించారు. కాగా,   టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, సముద్రాల వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్‌లను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణను పూర్తి చేసి స్పీకర్ తీర్పును వెలువరించాల్సి ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...