Monday, December 12, 2011

ఏడాది పాటు 'నీట్' వాయిదా

న్యూఢిల్లీ,డిసెంబర్ 13: ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను మరో ఏడాది వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత తలెత్తడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశంలోని 60 శాతం ఎంబీబీఎస్ సీట్లు గల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, గోవా, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలు ‘నీట్’ను వ్యతిరేకిస్తున్నాయి. ‘నీట్’ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని, ‘నీట్’ సిలబస్‌ను అభ్యర్థులకు కనీసం రెండేళ్ల ముందే, అంటే ఇంటర్‌లో చేరినప్పుడే వారికి పరిచయం చేయాలని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి. నిజానికి ‘నీట్’ నిర్వహణపై సుప్రీంకోర్టు ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉండగా, పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిని మరో ఏడాది వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫలితంగా సీబీఎస్‌ఈ 2012 సంవత్సరంలో ఆలిండియా ప్రీ మెడికల్/ప్రీ డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను (ఏఐపీఎంటీ) ఎప్పటి మాదిరిగానే నిర్వహించనుంది. 2012 ఏప్రిల్ 1న ఏఐపీఎంటీ ప్రిలిమినరీ, మే 13న ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని 15 శాతం ఆలిండియా కోటా సీట్ల భర్తీ కోసం సీబీఎస్‌ఈ ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...