‘బిజినెస్‌మేన్’ ఆడియో విడుదల
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘బిజినెస్‌మేన్’ ఆడియో విడుదలయింది. శిల్పా కళావేదికలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెలుగు, తమిళం, మలయాళంలో భాషల్లో ఒకేసారి ఈ సినిమా ఆడియో విడుదల చేశారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల దంపతులు, నిర్మాత రామానాయుడు, హీరో మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్, హీరోయిన్ కాజల్, దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, రాజమౌళి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. ' మహేష్‌తో సినిమా చేయడం ఒక మత్తు. డెరైక్టర్‌కి కిక్కిస్తాడు. బిజినెస్‌మేన్’తో మహేష్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా అన్నారు. మహేష్ మాట్లాడుతూ -‘‘జగన్ ఎప్పుడు సినిమా మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తి చేశారో నాకే తెలియలేదు. జగన్ పెన్ పవరేంటో రేపు తెరమీద చూస్తారు. థమన్ అద్భుతంగా సంగీతం అందించాడు. జనవరి 11న మనందరికీ పెద్ద పండుగ మొదలు కాబోతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ -‘‘రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది. మహేష్, నేను కలిసి సినిమా చేయాలని కమిటైపోయాం. కౌబాయ్, జేంస్బాండ్ తరహా కావాలో లేక అల్లూరి సీతారామరాజులాంటి సినిమా చేయాలో అభిమానులే నిర్ణయించాలి’’ అని తెలిపారు. మహేష్, నమ్రతలను పూరి జగన్నాథ్ సభాముఖంగా సరదాగా ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్ని అలరించింది.

Comments