Thursday, December 8, 2011

మరో ధర్మాసనానికి బాబు అక్రమాస్తుల కేసు

హైదరాబాద్,డిసెంబర్ 9:  చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఊహించని మలుపు తిరిగింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడంలో తప్పేముందంటూ హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. చంద్రబాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని, సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు, రామోజీరావు, సీఎం రమేష్ తదితరులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను తాము విచారించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది.చంద్రబాబుకు మద్దతుగా రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. రిలయన్స్‌లో తనకు వాటాలు ఉన్నందున ఈ కేసును తాను విచారించడం సబబుగా ఉండదని, అందువల్ల ఈ కేసు మొత్తాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసును విచారించే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు.  చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లను జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...