Monday, December 12, 2011

చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి...?

న్యూఢిల్లీ,డిసెంబర్ 13:  కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఊరిస్తూ వస్తున్న కేంద్ర మంత్రి పదవి ఈసారి విస్తరణలో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  యూపీఏ కూటమిలో కొత్తగా చేరిన ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) అధినేత అజిత్‌సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి వీలుగా  కేంద్ర కేబినెట్ విస్తరణకు  సన్నాహాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ నాయకుడికి కూడా ఈసారి తప్పకుండా పదవి దక్కుతుందని చిరంజీవి సహచరులు, అనుచరులు  ఆశ పడుతున్నారు.రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మంగళవారం ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత ఏ క్షణమైనా సరే కేబినెట్‌లోకి అజిత్‌సింగ్‌ను తీసుకోవచ్చని గట్టి సంకేతాలున్న తరుణంలో చిరంజీవికి పదవి అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఇప్పుడుకేంద్ర కేబినెట్‌ను విస్తరించాల్సి రావడానికి  పెద్ద కారణమే ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేసి అధికస్థానాలను సాధించాలన్న వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం ఆర్‌ఎల్‌డీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అజిత్‌సింగ్ తన పార్టీని యూపీఏలో భాగస్వామిగా చేస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాకు ఇప్పటికే లేఖ రాయడంతోపాటు స్వయంగా ఆమెని కలిశారు. యూపీఏలో ఆర్‌ఎల్‌డీ చేరికకు సోనియా వెంటనే గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారు. అలాగే, అజిత్‌సింగ్ కోరినట్టుగా కేబినెట్‌లో కీలక శాఖను ఇవ్వడానికీ ఆమె సమ్మతించారు. ఆర్‌ఎల్‌డీతో కుదిరిన పొత్తు ఒడంబడికలో భాగంగా అజిత్‌సింగ్‌కు కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన పౌరవిమానయాన శాఖను ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పౌర విమానయాన శాఖను సీనియర్ మంత్రి వయలార్ రవి చూస్తున్నారు. వాస్తవానికి ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఆయనకు గతంలో చేసిన మార్పుల సందర్భంగా పౌర విమానయాన శాఖను అదనంగా అప్పగించారు. వయలార్ రవితోపాటు కేబినెట్‌లోని మరో 9మంది మంత్రుల వద్ద రెండేసి శాఖలు ఉన్నాయి. శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, కపిల్‌సిబల్, ఆనంద్ శర్మ, సెల్జా, పవన్‌కుమార్ బన్సల్, సల్మాన్‌ఖుర్షీద్, జైరాం రమేశ్, కిశోర్‌చంద్రదేవ్‌లు ఒక్కొక్కరూ రెండు శాఖలను చూస్తున్నారు. వీరిందరి దగ్గరున్న శాఖలూ చాలా ముఖ్యమైనవే కావడంతో పౌర విమానయాన శాఖను ఇవ్వని పక్షంలో ఎవరో ఒకరి దగ్గరున్న అదనపు శాఖను అజిత్‌సింగ్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...