Sunday, December 11, 2011

జయప్రదం గా సీజన్ ముగించిన భారత్

ఆఖరివన్డేలో 34 పరుగులతో వెస్టిండీస్‌పై గెలుపు 
చెన్నై,డిసెంబర్ 11:  చిదంబరం స్టేడియంలో ఆదివారం నాడు ఆసక్తికరంగా సాగిన ఐదవ, ఆఖరి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. మనోజ్ తివారీ (126 బంతుల్లో 104 రిటైర్డ్‌హర్ట్; 10 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించగా... ఈ ఏడాది వన్డేల్లో టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లి (85 బంతుల్లో 80; 5 ఫోర్లు) సమయోచితంగా రాణించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తివారీ... గంభీర్ (41 బంతుల్లో 31; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. కోహ్లితో కలిసి 117 పరుగులు జోడించాక... కండరాలు పట్టేయడంతో తివారీ రిటిర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రోచ్, మార్టిన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ జట్టు 44.1 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటయింది. 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... పొలార్డ్ (110 బంతుల్లో 119; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) చివరి వరకూ పోరాడి కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. రస్సెల్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేశాడు. టెయిలెండర్ల సహాయంతో పొలార్డ్ సాగించిన పోరాటం ఒక దశలో భారత శిబిరంలో ఆందోళన పెంచినా... ఈ కరీబియన్ స్టార్ 11వ సిక్సర్ కోసం ప్రయత్నించి అవుటవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. జడేజా మూడు వికెట్లు తీసుకోగా... పఠాన్, మిథున్ రెండేసి వికెట్లు సాధించారు. ఈ ఏడాది భారత జట్టు స్వదేశంలో ఒక్క టోర్నీలోనూ ఓడిపోకుండా సగర్వంగా సీజన్‌ను ముగించింది. ప్రపంచకప్, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ సత్తాచాటి హ్యాట్రిక్ ట్రోఫీలను సాధించింది. స్వదేశంలో ఆడిన 18 వన్డేల్లో కేవలం రెండు సార్లు మాత్రమే భారత్ ఓడిపోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...