Friday, December 23, 2011

కాంగ్రెస్ 'మార్క్' సమన్వయం !

న్యూఢిల్లీ,డిసెంబర్ 23:   రాష్ట్ర కాంగ్రెస్‌లో  పార్టీ నాయకత్వం, ప్రభుత్వ సారథ్యం మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో... పరిస్థితిని చక్కదిద్దడానికి అధిష్టానం  సమన్వయ కమిటీని రంగం లోకి దించింది.  ఈ కమిటీకి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహిస్తారు.  దీంతో రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆజాద్ ఇకనుంచి మరింత క్రియాశీలంగా ‘సూపర్‌బాస్’ పాత్రను పోషించే అవకాశం వుంది.  సమన్వయ కమిటీలో ఆజాద్‌తోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవిలకు అధిష్టానం స్థానం కల్పించింది. గత కొద్ది మాసాలుగా పీసీసీ చీఫ్, సీఎం పరస్పర విరుద్ధ వైఖరులతో నడుస్తున్న వైనాన్ని అధిష్టానం గమనించిందని, వారి మధ్య రాజీ మిధ్య అని తేలడంతోనే సమన్వయ కమిటీని వేసిందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.  కమిటీలో సీమాంధ్ర నుంచి నలుగురు ఉండగా తెలంగాణ నుంచి ముగ్గురే ఉండటం గమనార్హం. గతంలో వైఎస్ హఠాన్మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అధిష్టానం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2010 ఫిబ్రవరి 5న నాటి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో రోశయ్య, డి.శ్రీనివాస్, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కావూరి, గీతారెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సారి  కమిటీ లో కేవీపీ రామచంద్రరావు, గీతారెడ్డి, జానారెడ్డి లకు చోటు దక్కలేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...